Telangana | రాష్ర్టానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బతికే ఉండాలని వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూనంనేని మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీల సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగించాలని కోరారు. ప్రభుత్వంలో భాగమైనా ఉద్యమాలు, పోరాటాలు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కాదని, పదవి కోసం దిగజారే వ్యక్తి అని కూనంనేని విమర్శించారు. దేశంలో 400 సీట్ల వస్తాయని చెప్పిన ఆయనకు ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారని, అధికారం కోల్పోయే దశకు బీజేపీ పార్టీ చేరిందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ఆ పార్టీ సిద్ధాంతాలను మరిచాయని, ఇతర పార్టీ నాయకులను చేర్చుకొని అధికారంలోకి వచ్చాయని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ మాదిరిగా అధికార దాహంతో సీపీఐ పార్టీ ఉండబోదని, సమాజాన్ని చైతన్య పరిచేది సీపీఐ మాత్రమేనని తెలిపారు.