న్యూఢిల్లీ: గత ఏడాది ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్(Rishabh Pant) 27 కోట్లకు అమ్ముడుపోయాడు. లక్నో సూపర్ గెయింట్స్ జట్టు అతన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో కూడా అతను వేలానికి సిద్దం అయ్యాడు. ఆ వేలంలోనూ అతనికి భారీగా ధర పలికే అవకాశం ఉన్నది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ కోసం మొత్తం 8 జట్లు పోటీపడనున్నాయి. దీంట్లో రిషబ్ పంత్ తో పాటు ఐపీఎల్లో ఆడిన కొందరు స్టార్ ఆటగాళ్లు వేలానికి ఉన్నారు. ప్రియాన్ష్ ఆర్యా, దిగ్వేశ్ రాథీ లాంటి క్రికెటర్లు కూడా ఉన్నారు. జూలై 6, 7 తేదీల్లో ఆటగాళ్ల వేలం జరగనున్నది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో మరో రెండు జట్లు కొత్తగా జతకూడినట్లు ఇవాళ డీడీసీఏ ప్రకటించింది. దీంతో ఆ జట్ల సంఖ్య 8కి చేరింది. రిషబ్ పంత్, దిగ్వేశ్, ప్రియాన్ష్, ఇశాంత్ శర్మ, ఆయుష్ బదోనీ, హర్షిత్ రాణా, హిమ్మత్ సింగ్, సుయాశ్ శర్మ, మయాంక్ యాదవ్, అనుజ్ రావత్ డీపీఎల్లో ఆడనున్నారు.