హెడింగ్లీ: ప్రతిష్టాత్మక టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో బోణీ కొట్టేదెవరో నేడు తేలనుంది! ఇంగ్లండ్, భారత్ మధ్య లీడ్స్ వేదికగా ఆద్యంతం ఆసక్తిగా జరుగుతున్న తొలి టెస్టులో ఇరు జట్లనూ విజయం ఊరిస్తుండగా విజేతలుగా నిలిచేదెవరన్నది ఆసక్తిగా మారింది. ప్రత్యర్థి ఎదుట భారత్ 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లిష్ జట్టు.. ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 రన్స్ చేసింది.
ఆట ఆఖరి రోజు టీమ్ఇండియా విజయానికి 10 వికెట్లు అవసరం కాగా ఆతిథ్య జట్టుకు 350 పరుగులు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఐదో రోజు మ్యాచ్ మరింత రసవత్తరంగా మారనుంది. ఇక నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో భారత్.. 96 ఓవర్లలో 364 పరుగులకు ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ (247 బంతుల్లో 137, 18 ఫోర్లు) శతకంతో మెరవగా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ హీరో రిషభ్ పంత్ (140 బంతుల్లో 118, 15 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి అదే ఫీట్‌ను పునరావృతం చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 90/2తో బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ఇండియా.. తొలి సెషన్ మొదటి ఓవర్లోనే కెప్టెన్ గిల్ (8) వికెట్‌ను కోల్పోవడంతో ఆత్మరక్షణలో పడింది. కార్స్ బౌలింగ్‌లో గిల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో రాహుల్, పంత్ అనవసరపు షాట్లకు పోకుండా నెమ్మదిగా ఆడారు. ఈ ఇద్దరూ తొలి సెషన్లో 24.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినా భారత్.. వికెట్ నష్టానికి 63 పరుగులే చేసింది. మూడో రోజు ధాటిగా ఆడిన రాహుల్.. ఫస్ట్ సెషన్లో డిఫెన్స్‌కే ప్రాధాన్యమిచ్చాడు. 87 బంతుల్లో అతడు టెస్టులలో 18వ అర్ధ శతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత అడపాదడపా బౌండరీలు తప్ప భారత ఇన్నింగ్స్ నత్తనడకను తలపించింది. ఈ ద్వయం ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించింది.
తొలి సెషన్లో ఇంగ్లిష్ బౌలర్లను పరీక్ష పెట్టిన రాహుల్-పంత్ జోడీ.. భోజన విరామం తర్వాత ఆటతీరును పూర్తిగా మార్చింది. 153/3తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఈ ద్వయం రెచ్చిపోయింది. సెకండ్ సెషన్లో 27 ఓవర్లు ఆడి ఏకంగా 5.3 రన్‌రేట్‌తో 145 పరుగులు రాబట్టింది. టంగ్ బౌలింగ్‌లో మూడు బౌండరీలు బాదిన పంత్ 82 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. ఆ తర్వాత బషీర్ ఓవర్లో రెండు సిక్సర్లతో అలరించాడు. మరో ఎండ్‌లో రాహుల్ సైతం జోరు పెంచాడు. బషీర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 90లలోకి వచ్చిన అతడు.. 62వ ఓవర్లో ఆఖరి బంతిని స్వీపర్ కవర్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో టెస్టులలో రాహుల్ 9వ శతకం పూర్తయింది. ఇక హాఫ్ సెంచరీ తర్వాత 27 బంతుల్లోనే ధనాధన్ ఆటతో 95 మార్కుకు చేరుకున్న పంత్.. సెంచరీకి ముందు కాస్త నెమ్మదించాడు. ఎట్టకేలకు బషీర్ బౌలింగ్‌లో డీప్ పాయింట్ దిశగా సింగిల్ తీసి ఒకే టెస్టులో రెండు శతకాలు నమోదుచేశాడు. టెస్టులలో పంత్‌కు ఇది 8వ సెంచరీ. కానీ బషీర్ పంత్‌ను ఔట్ చేసి 195 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు.
పంత్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్ (20)తో కలిసి రాహుల్.. స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. కానీ కొత్త బంతిని తీసుకున్న తర్వాత బ్రైడన్ కార్స్.. రాహుల్‌ను ఔట్ చేశాడు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. కరుణ్.. వోక్స్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టంగ్ ఒకే ఓవర్లో శార్దూల్ (4), సిరాజ్, బుమ్రాను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బకొట్టాడు. జడేజా (25*) కొద్దిసేపు ఇంగ్లీష్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.
1 టెస్టులలో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్ కీపర్ పంత్. అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించినవారిలో ఆండీ ప్లవర్ తర్వాత పంత్ రెండో స్థానంలో ఉన్నాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్; భారత్ రెండో ఇన్నింగ్స్: 96 ఓవర్లలో 364 ఆలౌట్ (రాహుల్ 137, పంత్ 118, టంగ్ 3/72, కార్స్ 3/80); ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 6 ఓవర్లలో 21/0 (క్రాలీ 12*, డకెట్ 9*)