Rinku Singh : ఐపీఎల్ 16వ సీజన్లో సిక్సర్ల మోతతో భారత జట్టు(Team India) జెర్సీ వేసుకున్న రింకూ సింగ్(Rinku Singh) టీ20ల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో ఫినిషర్‌గా రాణించిన రింకూ.. సఫారీ టూర్(South AfricaTour)లో దంచికొట్టాలనే కసితో ఉన్నాడు. రేపటితో పొట్టి సిరీస్‌కు తెరలేవనున్న నేపథ్యంలో రింకూ అక్కడి పిచ్‌లపై స్పందించాడు. అదనపు పేస్, బౌన్స్‌తో కూడిన దక్షిణాఫ్రికా పిచ్‌లపై పరుగులు సాధించాలంటే ప్రాక్టీస్ ఎక్కువ అవసరమని అభిప్రాయపడ్డాడు.
‘నేను ఇక్కడ నెట్స్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారత పిచ్‌లతో పోల్చితే సఫారీ పిచ్‌లపై అదనపు పేస్, బౌన్స్ రావడం గమనించాను. అందుకని ఇక్కడ రాణించాలంటే పేస్ బౌలింగ్‌లో మరింత ప్రాక్టీస్ అవసరం. తొలి ప్రాక్టీస్ సెషన్‌ను నేను ఎంతో ఎంజాయ్ చేశాను. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) సర్ ఆధ్వర్యంలో ఆడడం నిజంగా ఎంతో గొప్ప అవకాశం. ఆయన నన్ను నా సహజ శైలికి తగ్గట్టు దూకుడుగా ఆడాలని ప్రోత్సహించారు’ అని బీసీసీఐ టీవీతో రింకూ తెలిపాడు. ఐదు లేదా ఆరో స్థానంలో ఆడడంపై కూడా రింకూ మాట్లాడాడు.

‘నేను 2013 నుంచి ఉత్తరప్రదేశ్ జట్టు తరఫున ఐదు, ఆరు స్థానాల్లో ఆడుతున్నా. ఆ స్థానాల్లో ఆడడానికి అలవాటు పడ్డాను. తొలి నాలుగు వికెట్లు పడ్డాక ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టమే. ఈ పరిస్థితుల్లో నేను భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉంటుంది’ అని రింకూ వెల్లడించాడు. ఐపీఎల్ 16వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తరఫున సిక్సర్ల మోత మోగించిన రింకూ టీమిండియాకు ఎంపికయ్యాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు మూడు ఫార్మాట్ల సిరీస్ ఆడనుంది. అందులో భాగంగా డిసెంబర్ 10న మొదలయ్యే టీ20లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యువ భారత్.. సఫారీలతో తలపడనుంది. ఈ సిరీస్‌కు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌కు ముందు రోజే దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దాంతో, అతడి స్థానంలో సెలెక్టర్లు బురాన్ హెండ్రిక్స్‌ను జట్టులోకి తీసుకుంది.