Ricky Ponting : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఉన్న భారత జట్టుకు ఇక ప్రతి సిరీస్ ఎంతో కీలకం. ముచ్చటగా మూడోసారి టైటిల్ వేటకు సిద్దవుతున్న టీమిండియాకు నవంబర్‌లో కఠిన సవాల్ ఎదురవ్వనుంది. ఆస్ట్రేలియా గడ్డపై జరుగనున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy) రోహిత్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాల్ని నిర్ణయించనుంది. ఎంతో కీలకమైన ఈ సిరీస్‌లో విజేతగా నిలిచేది ఎవరు? అనే చర్చకు అప్పుడే తెరలేచింది. భారత్, ఆసీస్‌లకు సమాన అవకాశాలు ఉన్నాయని కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ దిగ్గజం రికీ పాంటింగ్(Ricky Ponting) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈసారి తమకు యువకెరటం యశస్వీ జైస్వాల్(Yashasvi Jasiwal) నుంచే ముప్పు ఉందంటూ చాలామంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని స్పిన్నర్ నాథన్ లియాన్ ఓపెన్‌గా చెప్పాడు కూడా. అయితే.. యశస్వీ కంటే ప్రమాదకరమైన ఆటగాడు రిషభ్ పంత్ (Rishabh Pant) అని, అతడితో జాగ్రత్తగా ఉండాలని పాంటింగ్ ఆసీస్‌ను హెచ్చరించాడు.
‘గత పర్యటనలో పంత్ చెలరేగిన తీరును అతడు ప్యాట్ కమిన్స్ బృందానికి గుర్తు చేశాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సమర్ధుడు పంత్. అతడు ఉతకడం మొదలెడితే అంతే ఉండదు. అంతేకాదు వికెట్ల వెనకాల కూడా అతడు ప్రత్యర్థి బ్యాటర్లను అలవోకగా మోసం చేయగలడు’ అని పాంటింగ్ తెలిపాడు.
టెస్టు క్రికెట్లో రిషభ్ పంత్ ఎంత ప్రమాదకర ఆటగాడో అందరికీ తెలిసిందే. టీ20 తరహాలో రెచ్చిపోయి ఆడే పంత్ క్రీజులో ఉన్నాడంటే.. ప్రత్యర్థి కెప్టెన్‌కు హడలే. రెండేండ్ల క్రితం గబ్బా, మెల్బోర్న్ స్టేడియంలో ఈ లెఫ్ట్ హ్యాండర్ సృష్టించిన విధ్వంసాన్ని ఆస్ట్రేలియా క్రికెటర్లు కలలో కూడా మర్చిపోలేరు.
స్టార్ ఆటగాళ్లంతా చేతులెత్తేసిన చోట పంత్ గబ్బాలో (89 నాటౌట్) చెలరేగిన తీరు వర్ణణాతీతం. ఆపై సిడ్నీలో (97 నాటౌట్) ఛతేశ్వర పుజారాతో కలిసి నాలుగో వికెట్‌కు నెలకొల్పిన 148 పరుగుల భాగస్వామ్యాన్ని ఎంత పొగిడినా తక్కువే. అందుకే పంత్ బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీకి వస్తున్నాడంటేనే ఆస్ట్రేలియన్లలో కంగారు మొదలైంది. ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. 1992 తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని తొలిసారి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా నిర్వహిస్తున్నారు.