అమరావతి : తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే విజయవాడకు వరదలు వచ్చాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. బుడమేరు (Budameru) వాగు గురించి అటు జగన్, ఇటు చంద్రబాబు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారని విమర్శించారు. కాకినాడలోని ఇటీవల భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆమె పరామర్శించి రైతులకు ధైర్యం చెప్పారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞం పేరిట 42 ప్రాజెక్టులను చేపట్టగా నేటికి 32 పనులు పెండింగ్లోనే ఉన్నాయని అన్నారు. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నా వాటిని పట్టించుకోలేదని, కనీసం ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేశారని ఆరోపించారు. ఏలేరు ఆధునికరణ జరగకపోవడం, పూడిక తియ్యకపోవడం వల్లే ఇంతటి విపత్తు ఏర్పడిందన్నారు.
రైతులు అప్పులు చేసి పంట వేసి కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. జగన్ ఏలేరు ఆధునికరణను చేయకపోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేల బదులు రూ. 25 వేల నష్టపరిహారం(Compensations) ఇవ్వాలని డిమాండ్ చేశారు.