ఈ సీజన్లో ప్రత్యర్థి జట్లను తమ సొంత వేదికలపై మట్టికరిపిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. జైపూర్‌లోనూ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ విజయఢంకా మోగించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన పోరులో బంతితో పాటు బ్యాట్‌తోనూ సమిష్టిగా రాణించి ఈ సీజన్లో నాలుగో విజయాన్ని నమోదుచేసింది. మొదట బౌలర్లు రాణించడంతో రాయల్స్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు మరో 15 బంతులుండగానే ఊదేసింది. సాల్ట్ ధనాధన్ విధ్వంసానికి తోడు కోహ్లీ మరో సమయోచిత ఇన్నింగ్స్ ఆడటంతో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. యశస్వీ జైస్వాల్ అర్ధ సెంచరీతో మెరిసినా.. ఈ సీజన్లో రాజస్థాన్‌కు నాలుగో ఓటమి తప్పలేదు.
RCB | జైపూర్: ‘రాయల్స్’ పోరులో బెంగళూరుదే పైచేయి అయింది. రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య ఆదివారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి తిరిగి గెలుపు బాట పట్టింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65, 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులకు తోడు విరాట్ కోహ్లీ (45 బంతుల్లో 62 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో 176 పరుగుల ఛేదనను ఆ జట్టు 17.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75, 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ధ్రువ్ జురెల్ (35) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 173/4 స్కోరు చేసింది. సాల్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో బెంగళూరుకు ఇది నాలుగో విజయం. కాగా ఈ 4 ప్రత్యర్థుల గడ్డపై సాధించినవే కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీలతో బరిలోకి దిగిన బెంగళూరు.. లక్ష్యాన్ని ఛేదించడానికి పెద్దగా కష్టపడలేదు. విధ్వంసకర ఓపెనర్ సాల్ట్.. ఎప్పటిలాగే ఆరంభం నుంచే దంచుడు మంత్రాన్ని జపించగా కోహ్లీ ఆరంభంలో అతడికి అండగా నిలిచి తర్వాత గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్లోనే 4, 6తో ఛేదనను ప్రారంభించిన సాల్ట్.. అతడి మరుసటి ఓవర్లోనూ అదే సీన్‌ను రిపీట్ చేశాడు. ఆ తర్వాత తీక్షణ, సందీప్ బౌలింగ్‌లోనూ ఇదే కథ పునరావృతమవడంతో బెంగళూరు పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. హసరంగ ఓవర్లో బౌండరీతో 28 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన సాల్ట్ కార్తికేయ 9వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి జైస్వాల్‌కు చిక్కడంతో 94 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సాల్ట్ నిష్క్రమించినా బెంగళూరు ఇబ్బందిపడలేదు. అప్పటికే లక్ష్యంలో సగం దంచేసిన ఆర్సీబీ.. అదే దూకుడును కొనసాగించింది. పడిక్కల్ (40 నాటౌట్)తో జతకలిసిన కోహ్లీ.. హసరంగ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్సర్ బాది ఈ సీజన్లో మూడో హాఫ్ సెంచరీని నమోదుచేశాడు. టీ20లలో అతడికి ఇది వందో అర్ధ శతకం. పడిక్కల్ సైతం ధాటిగా ఆడి లాంఛనాన్ని పూర్తిచేశాడు.
బెంగళూరు బ్యాటర్లు అలవోకగా దంచేసిన జైపూర్ పిచ్‌పై రాజస్థాన్ మాత్రం ధాటిగా ఆడలేకపోయింది. బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేయడంతో సొంత వేదికపై రాజస్థాన్ తడబడింది. మొదట్నుంచే బౌలర్లపై విరుచుకుపడే జైస్వాల్, కెప్టెన్ శాంసన్ (15) క్రీజులో ఉన్నా పవర్ ప్లేలో ఆ జట్టు చేసిన స్కోరు 45 పరుగులే. అందులోనూ శాంసన్.. 16 బంతుల్లో చేసింది 13 పరుగులే. ఏడో ఓవర్లో బౌలింగ్ మార్పుగా వచ్చిన కృనాల్.. శాంసన్‌ను బోల్తొ కొట్టించడంతో ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అయితే పరాగ్ (30) రాకతో స్కోరు వేగం పుంజుకుంది. కృనాల్, సుయాశ్ బౌలింగ్‌లో మంచి షాట్లు ఆడిన పరాగ్.. దయాల్ 14వ ఓవర్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసిన జైస్వాల్.. హాజిల్‌వుడ్ 16వ ఓవర్లో 6, 4తో గేర్ మార్చినట్టే అనిపించినా అదే ఓవర్ ఆఖరి బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆఖర్లో జురెల్ వేగంగా ఆడినా హెట్మెయర్ బ్యాట్ ఝుళిపించకపోవడంతో రాజస్థాన్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 1
1 టీ20లలో వంద అర్ధ శతకాలు సాధించిన తొలి భారత బ్యాటర్ కోహ్లీ. అంతర్జాతీయ స్థాయిలో వార్నర్ (116), గేల్ (110) కోహ్లీ కంటే ముందున్నారు.
2 ఆర్సీబీ తరఫున ఆడుతూ కోహ్లీ తర్వాత వెయ్యి పరుగుల మార్కును దాటిన రెండో ఆటగాడు పడిక్కల్.
రాజస్థాన్: 20 ఓవర్లలో 173/4 (జైస్వాల్ 75, జురెల్ 35, హాజిల్‌వుడ్ 1/26, కృనాల్ 1/29);
బెంగళూరు: 17.3 ఓవర్లలో 175/1 (సాల్ట్ 65, కోహ్లీ 62*, కార్తికేయ 1/25)