బెంగళూరు: ఐపీఎల్ 19వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు అదిరిపోయే ఆరంభం. చిన్నస్వామి స్టేడియంలో ఉద్విగ్నభరిత క్షణాల మధ్య శనివారం జరిగిన లీగ్ తొలి పోరులో ఆర్సీబీ దుమ్మురేపింది. వేలాది మంది ప్రేక్షకుల మధ్య సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో(26 బంతులు మిగిలుండగానే) సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ నిరుడు సీజన్లో ఐపీఎల్ టైటిల్‌ను తొలిసారి ముద్దాడిన ఆర్సీబీ చాంపియన్ ఆటతీరు కనబరిచింది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్..హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
కెప్టెన్ ఇషాన్ కిషన్(38 బంతుల్లో 80, 8ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో హైదరాబాద్ 20 ఓవర్లలో 201/9 స్కోరు చేసింది. క్లాసెన్(31), అనికేత్(43) రాణించడంతో హైదరాబాద్ పోరాడే స్కోరు దక్కింది. అరంగేట్రం బౌలర్ జాకబ్ డఫీ(3/22), రొమారియో షెఫర్డ్(3/54) మూడేసి వికెట్లతో రాణించారు. లక్ష్యఛేదనలో విరాట్‌కోహ్లీ(38 బంతుల్లో 69 నాటౌట్, 5ఫోర్లు, 5 సిక్స్‌లు), దేవదత్ పడిక్కల్(26 బంతుల్లో 61, 7ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో బెంగళూరు 15.4 ఓవర్లలో 203/4 స్కోరు చేసింది. డేవిడ్ పైన్(2/35)రెండు వికెట్లు తీశాడు. డఫీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
లక్ష్యఛేదనలో ఆర్సీబీ బ్యాటర్లు ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న ఫిల్ సాల్ట్..నితీశ్‌కుమార్‌రెడ్డి బౌలింగ్‌లో బౌండరీలతో విరుచుకుపడ్డా అదే జోరు కొనసాగించలేకపోయాడు. ఉనద్కట్ రెండో ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన సాల్ట్ మిడాఫ్‌లో క్లాసెన్ చేతికి చిక్కాడు. ఒకే క్యాచ్ కోసం ఇద్దరు ప్రయత్నించినా ఆఖరికి క్లాసెన్‌కే దక్కడంతో హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంది. డఫీ స్థానంలో ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన దేవదత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చి రావడంతోనే సిక్స్‌తో తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. దేశవాళీ సీజన్లో సూపర్ ఫామ్‌ను ఐపీఎల్లో కొనసాగిస్తూ పడిక్కల్ అలవోకగా బౌండరీలు బాదడంతో స్కోరుబోర్డు ఊపందుకుంది. మరో ఎండ్‌లో కోహ్లీ కూడా బ్యాటు ఝులిపించడంతో పరుగుల రాక సులువైంది.
డేవిడ్ పైన్ నాలుగో ఓవర్లో పడిక్కల్ విశ్వరూపం చూపించాడు. రెండు భారీ సిక్స్‌లు, ఓ ఫోర్‌తో పడిక్కల్ 18 పరుగులు పిండుకున్నాడు. మరుసటి ఓవర్లో తన వంతూ అంటూ కోహ్లీ కూడా రెచ్చిపోవడంతో 50 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. పవర్‌ప్లే ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ కోల్పోయి 76 పరుగులు చేసింది. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి కోహ్లీ బయటపడగా, 8.1 ఓవర్లలో ఆర్సీబీ 100 పరుగుల మార్క్ అందుకుంది. ఇన్నింగ్స్ ఊపందుకుంటున్న తరుణంలో అప్పటికే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్..దూబే బౌలింగ్‌లో ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 101 పరగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్న కోహ్లీ..కెప్టెన్ పాటిదార్(31)తో కలిసి ముందుకు నడిపించాడు. అయితే పైన్ బౌలింగ్‌లో పటిదార్, జితేశ్(0) వెంటవెంటనే ఔటైనా..ఆఖర్లో డేవిడ్(16 నాటౌట్)తో కలిసి కోహ్లీ గెలుపు తీరాలకు చేర్చాడు.
ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సహచరులు విఫలమైన వేళ తన ఫామ్‌ను కొనసాగిస్తూ జట్టుకు భారీ స్కోరు అందించాడు. హెడ్(11), అభిషేక్(7) స్వల్ప స్కోర్లకే వెనుదిరుగగా, కిషన్ సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. మిడిలార్డర్లో నితీశ్(1), సలీల్ అరోరా(9), హర్ష్‌దూబే(3) ఇలా వచ్చి ఆలా వెళ్లారు. క్లాసెన్‌తో కలిసి కిషన్ ఇన్నింగ్స్..హైదరాబాద్ 200ల స్కోరుకు కారణమైంది. దీనికి తోడు ఆఖర్లో అనికేత్ దూకుడుగా ఆడటం కలిసొచ్చింది.
గతేడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 11 మందికి ఆర్సీబీ, హైదరాబాద్ ప్లేయర్లు ఘనంగా నివాళి అర్పించారు. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లో ఘటనకు సంతాప సూచికంగా అందరూ 11 నంబర్ జెర్సీలు ధరించారు. దీనికి తోడు స్టేడియంలో 11 సీట్లను ఖాళీగా వదిలిపెడుతూ మృతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల ప్లేయర్లు బౌండరీ లైన్ వద్ద మృతుల కుటుంబాలకు సంతాప సూచకంగా కొద్దిసేపు మౌనం పాటించారు. ఆ తర్వాత జాతీయ గీతాలాపన చేసి బరిలోకి దిగారు.
హైదరాబాద్: 20 ఓవర్లలో 201/9(కిషన్ 80, అనికేత్ 43, డఫీ 3/22, షెఫర్డ్ 3/54),
బెంగళూరు: 15.4 ఓవర్లలో 203/4(కోహ్లీ 69 నాటౌట్, పడిక్కల్ 61, పైన్ 2/35, ఉనద్కట్ 1/29)