బెంగళూరు: ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఓటమి మినహాయిస్తే..ముంబై ఇండియన్స్‌ను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించిన ఆర్సీబీ..లక్నో సూపర్‌జెయింట్స్(ఎల్ఎస్జే) భరతం పట్టింది. చిన్నస్వామిలో గత ఓటములకు దీటైన ప్రతీకారం తీర్చుకుంటూ ఆర్సీబీ తొలిసారి విజయాన్నందుకుంది. బుధవారం కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య సాగిన పోరులో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో లక్నోపై ఘన విజయం సాధించింది.
తద్వారా ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో 8 పాయింట్లతో ఆర్సీబీ అగ్రస్థానంలోకి దూసుకెళ్లగా, లక్నో వరుసగా రెండో ఓటమితో ఏడో స్థానంలో కొనసాగుతున్నది. తొలుత హాజిల్‌వుడ్(4-0-20-1), రసిక్ సలామ్(4/24), భువనేశ్వర్(3/27) ధాటికి లక్నో 20 ఓవర్లలో 146 ఆలౌటైంది. మిచెల్ మార్ష్(40), ముకుల్ చౌదరి(39), ఆయూశ్ బదోని(38) ఒకింత ఆకట్టుకున్నా..మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. పిచ్ పిరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకున్నది. కెప్టెన్ రిషబ్ పంత్(1), నికోలస్ పూరన్(1), అబ్దుల్ సమద్(0) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.
ఆ తర్వాత 147 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(34 బంతుల్లో 49, 6ఫోర్లు, సిక్స్) పరుగు తేడాతో అర్ధసెంచరీ అవకాశాన్ని చేజార్చుకోగా, రజత్ పటిదార్(27), జితేశ్శర్మ (23) ఆకట్టుకున్నారు. ప్రిన్స్ యాదవ్ (3/32), అవేశ్‌ఖాన్ (2/23) రాణించారు. పొదుపైన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన హాజిల్‌వుడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
లక్నో బ్యాటింగ్ తీరు పడుతూ లేస్తూ అన్నట్లు సాగింది. పిచ్ పరిస్థితులను ముందే అంచనా వేసిన ఆర్సీబీ..బౌలింగ్ ఎంచుకుని ఆదిలోనే పైచేయి సాధించింది. జాకబ్ డఫీ స్థానంలో జట్టులోకి వచ్చిన స్టార్ పేసర్ హాజిల్‌వుడ్..లక్నో బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. వేగానికి స్వింగ్ జోడిస్తూ హాజిల్‌వుడ్ విసిరిన బంతులకు లక్నో బ్యాటర్ల దగ్గర సమాధానం లేకపోయింది. మార్ష్, మార్క్మ్(్ర12) కలిసి తొలి వికెట్‌కు 32 పరుగులు జోడించగా, పవర్‌ప్లే పూర్తయ్యే సరికి లక్నో వికెట్ నష్టానికి 35 పరుగులకు పరిమితమైంది.
హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వైవిధ్యమైన షాట్‌కు ప్రయత్నించిన కెప్టెన్ పంత్ మోచేతికి బంతి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన పంత్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. మిడిల్లో పూరన్‌ను హాజిల్‌వుడ్ క్లీన్‌బౌల్డ్ చేయగా, బదోని, ముకుల్ సమయోచితంగా ఆడారు. అడపాదడపా బౌండరీలతో కీలక పరుగులు జతచేశారు. వీరిద్దరు ఆడకపోతే లక్నో కనీసం 100 పరుగులకే పరిమితమయ్యేది. పంత్ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చినా లాభం లేకపోయింది.
ఐపీఎల్లో తొలిసారి ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ దూకుడు కనబరిచాడు. మోకాలి నొప్పితో ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్న కోహ్లీ బ్యాటింగ్‌లో తనదైన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. షమీ, ప్రిన్స్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ బౌండరీలతో దుమ్మురేపాడు. సాల్ట్(7) త్వరగానే ఔటైనా..పడిక్కల్(10), పటిదార్‌తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించాడు. మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులను బౌండరీకి సాగనంపాడు. అవేశ్ బౌలింగ్‌లో ఔటైనా ఆఖర్లో జితేశ్, డేవిడ్, షెఫర్డ్ బ్యాటింగ్‌తో ఆర్సీబీ అలవోక విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
లక్నో: 20 ఓవర్లలో 146 ఆలౌట్ (మార్ష్ 40, ముకుల్ 39, రసిక్ 4/24, భువనేశ్వర్ 3/27), బెంగళూరు: 15.1 ఓవర్లలో 149/5(కోహ్లీ 49, పటిదార్ 27, ప్రిన్స్ 3/32, అవేశ్ 2/23)