Chinnaswamy Stampede : చిన్నస్వామి తొక్కిసలాటకు సంబంధించిన కేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఉద్యోగికి ఊరట లభించింది. తొక్కిసలాటకు బాధ్యులంటూ పోలీసులు అరెస్ట్ చేసిన ఆర్సీబీ మార్కెటింగ్, రెవెన్యూ హెడ్‌గా పని చేస్తున్న నిఖిల్ సొసాలే (Nikhil Sosale)కు బెయిర్ వచ్చింది. గురువారం న్యాయస్థానం అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు దేశం విడిచి పెట్టవెళ్లకుండా పాస్‌పోర్టును అప్పగించాలని ఆదేశించింది.
ఆర్సీబీ విజయోత్సవం యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలటాలో 11 మంది మరణించారు. దాంతో, కర్నాటక ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు బాధ్యులైన ఫ్రాంచైజీ మార్కెటింగ్ హెడ్ సొసాలేతో పాటు ఆ ఈవెంట్‌ను నిర్వహించిన డీఎన్ఏ (DNA) ఎంటర్టైన్మెంట్ ఉద్యోగులైన కిరణ్ కుమార్(సీనియర్ ఈవెంట్ మేనేజర్), సునీల్ మథ్యూ(బిజినెస్ అఫైర్స్ ఉపాధ్యక్షుడు)లను జూన్ 6 శుక్రవారం పోలీసులు ఆరెస్ట్ చేశారు.
నిఖిల్ సొసాలే
ఆ రోజు ఉదయం నేర విభాగానికి చెందిన పోలీసులు సొసాలేను విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అతడి తరఫు న్యాయవాది అరెస్టును ఖండిస్తూ హై కోర్టులో దావా వేశారు.బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం గురువారం బెయిల్ మంజూరు చేసింది.
‘ఐపీఎల్ 18వ సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలవడంతో కర్నాటక ప్రభుత్వం విక్టరీ పరేడ్‌ను నిర్వహిచింది. జూన్ 3న చిన్నస్వామి స్టేడియంలో సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు బెంగళూరు ఆటగాళ్లను సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు స్టేడియానికి అభిమానులు భారీగా పోటెత్తారు. అసంఖ్యాకంగా వచ్చిన ఫ్యాన్స్‌ను అదుపు చేయడంలో పోలీసులు విఫలం అయ్యారు.
35 వేల మంది సామర్ధ్యమే ఉన్న స్టేడియంలోకి అభిమానులను పంపడంలో నిర్వాహకులు స్పష్టమైన ప్రణాళికతో లేరు. దాంతో, గేట్ నంబర్ 2, 2ఏ, 6, 7, 15, 17, 18, 20, 21 నంబర్ గేట్ల వధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 56 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్సీబీ ఫ్రాంచైజీ సోషల్ మీడియలో అందరికి ప్రవేశం ఉచితం అని పోస్ట్ పెట్టడంతోనే అభిమానులు భారీగా స్టేడియానికి వచ్చారు. అందువల్లే తొక్కిసలాట జరిగింది’ అని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.