IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఉత్కంఠ పోరాటలు.. ఆఖరి ఓవర్ థ్రిల్లర్స్ అభిమానులను అలరిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే పంజాబ్ కుర్రాడు ప్రియాన్ష్ ఆర్య (Priyansh Arya) మెరుపు శతకంతో ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగించాడు. ఇంకా ఇలాంటి అద్భుత మ్యాచ్‌లు మరెన్నో రాబోతున్నాయి. ఈ ఎడిషన్‌లో సంచలన విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) నాలుగో మ్యాచ్‌కు సిద్ధమైంది. హ్యాట్రిక్ విక్టరీలు కొట్టిన ఢిల్లీని ఢీకొనేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కాచుకొని ఉంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ, బెంగళూరు వరుసగా 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అందుకే ఈ మ్యాచ్‌లో తగ్గపోరు ఖాయం అంటున్నారు నిపుణులు. కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్(Axar Patel) సారథ్యంలో ఢిల్లీ అదరగొడుతోంది. వరుస మ్యాచుల్లో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. తొలి పోరులోనే 210 పరుగుల్ని ఛేదించి లక్నోకు షాకిచ్చిన ఢిల్లీ.. ఆ తర్వాత సన్‌రైజర్స్‌పై 7 వికెట్లతో జయకేతనం ఎగురవేసింది. మూడో గేమ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు ఓపెనర్ డూప్లెసిస్, కుర్రాడు ఫ్రేజర్ మెక్‌గుర్క్ విధ్వంసక బ్యాటింగ్‌తో శుభారంభమిస్తున్నారు.
అభిషేక్ పొరెల్, కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ మిడిల్ ఓవర్లలో సుడిగాలిలా చుట్టేయగల సమర్ధులు. ఇక ఫినిషర్ అశుతోష్ శర్మ(Ashutosh Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్నోపై మెరుపు అర్ధ శతకంతో నాటౌట్‌గా నిలిచిన అతడు ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిచెల్ స్టార్క్, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లతో ఢిల్లీ బౌలింగ్ యూనిట్ పటిష్టంగా ఉంది.
📍 Bengaluru
In the ❤ corner: The high-flying @RCBTweets ✈
In the 💙 corner: The unbeaten @DelhiCapitals 💪
We cannot wait for this thrilling contest 🤩#TATAIPL | #RCBvDC pic.twitter.com/fp5hQYj7pe
— IndianPremierLeague (@IPL) April 10, 2025
ఆర్సీబీ విషయానికొస్తే.. ఈసారైనా ట్రోఫీని ఒడిసిపట్టాలనే కసితో ఉంది. అనుకున్నట్టే 18వ ఎడిషన్‌ను విజయంతో ఆరంభించింది. బెంగళూరు ఇప్పటికి నాలుగు మ్యాచుల్లో మూడింట గెలిచింది. కానీ, సొంత మైదానంలో గుజరాత్ టైటన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత పుంజుకొని బలమైన ముంబై ఇండియన్స్‌పై 12 రన్స్ తేడాతో అద్భుత విజయం సాధించింది బెంగళూరు. వాంఖడేలో జరిగిన ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli), కెప్టెన్ రజత్ పటిదార్(Rajat Patidar) ముంబై బౌలర్లను ఉతికేశారు.
టాపార్డర్‌లో వీళ్లిద్దరూ అర్ధ శతకాలతో చెలరేగగా.. ఆఖర్లో జితేశ్ శర్మ 40 నాటౌట్ ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. పేసర్ హేజిల్‌వుడ్ ఆదిలోనే రెండు వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టాడు. కానీ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా భాగస్వామ్యంతో ఓటమి అంచున నిలిచినా.. కృనాల్ పాండ్యా 4 వికెట్లతో రాణించి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని కట్టబెట్టాడు. ఢిల్లీతో మ్యాచ్‌లోనూ సమిష్టిగా ఆడి గెలవాలని భావిస్తోంది ఆర్సీబీ. ఇప్పటివరకూ ఢిల్లీ, బెంగళూరు 30 సార్లు ఎదురుపడ్డాయి. ఆర్సీబీ 19 విజయాలు సాధించగా.. ఢిల్లీ 11 పర్యాయాలు గెలుపొందింది. ఈసారి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.