RCB | ముల్లాన్‌పూర్: సొంత వేదిక (చిన్నస్వామి)లో తడబడుతూ హ్యాట్రిక్ ఓటములు ఎదుర్కున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రత్యర్థుల గడ్డ మీద మాత్రం దుమ్మురేపుతున్నది. మూడు రోజుల క్రితమే బెంగళూరులో పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన పరాభవానికి దీటుగా బదులు తీర్చుకుంటూ.. ముల్లాన్‌పూర్‌లో శ్రేయస్ సేనపై 7 వికెట్ల తేడాతో సునాయస విజయం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్.. తడబాటుకు గురై నిర్ణీత ఓవర్లలో 157/6 పరుగులే చేయగలిగింది. ప్రభ్‌సిమ్రన్ (17 బంతుల్లో 33, 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్‌స్కోరర్ కాగా శశాంక్ (31 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ (2/25), సుయాశ్ (2/26) ప్రత్యర్థిని కట్టడిచేశారు. ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లీ (54 బంతుల్లో 73 నాటౌట్, 7 ఫోర్లు, 1 సిక్స్), దేవ్‌దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకాలతో మెరవడంతో లక్ష్యాన్ని బెంగళూరు 18.5 ఓవర్లలో పూర్తిచేసింది.
ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్ (22) మెరుపులతో పంజాబ్ ఇన్నింగ్స్ దూకుడుగానే మొదలైంది. దయాల్ రెండో ఓవర్లో బౌండరీతో ప్రభ్‌సిమ్రన్ బాదుడుకు శ్రీకారం చుడితే అదే ఓవర్లో ప్రియాన్ష్ 6, 4 బాదాడు. భువీ మూడో ఓవర్లో ప్రభ్‌సిమ్రన్.. మూడు బౌండరీలు సాధించాడు. ప్రియాన్ష్ వికెట్ కోల్పోయినా పవర్ ప్లేలో ఆ జట్టు 6 ఓవర్లకు 62/1తో పటిష్టంగానే ఉంది. కానీ స్పిన్నర్ల రాకతో పంజాబ్ కష్టాలు మొదలయ్యాయి. కృనాల్.. కింగ్స్‌కు వరుస షాకులిచ్చాడు. తొలుత ప్రభ్‌సిమ్రన్‌ను బోల్తా కొట్టించిన అతడు.. షెఫర్డ్ వేసిన 8 ఓవర్లో శ్రేయస్ అయ్యర్ (6) ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్ వద్ద అందుకున్నాడు. సుయాశ్.. 14వ ఓవర్లో ఆతిథ్య జట్టుకు డబుల్ షాకులిచ్చాడు. ఇంగ్లిస్(29)తో పాటు స్టోయినిస్ (1)నూ క్లీన్‌బౌల్డ్ చేసి పంజాబ్‌ను కోలుకోనీయకుండా చేశాడు.
అర్ష్‌దీప్ తొలి ఓవర్లోనే సాల్ట్ (1) వికెట్ కోల్పోయినప్పటికీ కోహ్లీ, పడిక్కల్ పంజాబ్‌కు ఎలాంటి అవకాశమూ ఇవ్వకుండా పనిపూర్తిచేశారు. బార్ట్లెట్ బౌ లింగ్లో 6,4 బాదిన పడిక్కల్ 30 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. ఫిఫ్టీ తర్వాత అతడు.. స్టోయినిస్ బౌలింగ్‌లో మరో సిక్స్, ఫోర్ కొట్టడంతో ఆర్సీబీ స్కోరు 100 పరుగుల మార్కు ను దాటింది. దూకుడుగా ఆడే క్రమం లో అతడు నిష్క్రమించినా అప్పటికే క్రీజులో కుదురుకున్న కోహ్లీ.. గెలుపు బాధ్యతలను భుజానికేసుకున్నాడు. యాన్సన్ 15వ ఓవర్లో సింగిల్‌తో కోహ్లీ ఈ సీజన్లో నాలుగో అర్ధశతకాన్ని నమోదుచేశాడు. చాహల్ ఓవర్లో కోహ్లీ 6, 4 బాదగా 19వ ఓవర్లో జితేశ్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
ఐపీఎల్లో కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పంజాబ్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ కోహ్లీకి ఈ ఫిఫ్టీ 67వది. దీంతో అతడు.. ఈ లీగ్‌లో అత్యధిక అర్ధ శతకాలు సాధించిన డేవిడ్ వార్నర్ (66) రికార్డును అధిగమించాడు.
పంజాబ్: 20 ఓవర్లలో 157/6 (ప్రభ్‌సిమ్రన్ 33, శశాంక్ 31*, కృనాల్ 2/25, సుయాశ్ 2/26);
బెంగళూరు: 18.5 ఓవర్లలో 159/3 (కోహ్లీ 73*, పడిక్కల్ 61, అర్ష్‌దీప్ 1/26, బ్రర్ 1/27)