IPL | ముంబై: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను ఊపేసింది. ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిలబెడుతూ ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో ముంబై ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)దే పైచేయి అయ్యింది. సోమవారం వాంఖడేలో జరిగిన హోరాహోరీ పోరులో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో ముంబైపై అద్భుత విజయం సాధించింది. తొలుత విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 67, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రజత్ పటీదార్ (32 బంతుల్లో 64, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సమయోచిత ఇన్నింగ్స్‌లకు తోడు ఆఖర్లో జితేశ్ శర్మ (19 బంతుల్లో 40 నాటౌట్, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులతో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఆర్సీబీ బ్యాటర్ల ధాటికి ముంబై బౌలర్లు సొంత వేదికలో ఘోరంగా విఫలమయ్యారు. గాయంతో మూడు నెలల విరామం తర్వాత ఫీల్డ్‌లోకి వచ్చిన బుమ్రా(0/29) వికెట్లు తీయకపోయినా ఆకట్టుకున్నాడు. రికార్డు ఛేదనలో ముంబై 20 ఓవర్లు ముగిసేసరికి 209/9 స్కోరు చేసింది. తిలక్‌వర్మ(56), హార్దిక్ పాండ్యా(42) పోరాడినా ఫలితం లేకపోయింది. కృనాల్ పాండ్యాకు నాలుగు వికెట్లు దక్కాయి.
కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇన్నింగ్స్ ధాటిగానే మొదలైంది. పవర్ ప్లేలో వేగంగా ఆడట్లేదన్న విమర్శలెదుర్కున్న రోహిత్ (9 బంతుల్లో 17, 2 ఫోర్లు, 1 సిక్స్).. 6, 4, 4తో ఇన్నింగ్స్‌ను జోష్‌తోనే ఆరంభించాడు. యష్ దయాల్ రెండో ఓవర్లో రెండు బౌండరీలు సాధించిన హిట్‌మ్యాన్.. ఇన్‌స్వింగర్‌గా వేసిన నాలుగో బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. భువీ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన రికెల్టన్ (17).. హెజిల్వుడ్ ఓవర్లో వికెట్ల ముందు బలయ్యాడు.
ఈ క్రమంలో విల్ జాక్స్ (18 బంతుల్లో 22, 2 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 28, 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించారు. మూడో వికెట్‌కు ఈ జోడీ 41 పరుగులు జతచేసింది. కానీ ఆశించిన స్థాయిలో వేగంగా ఆడకపోయిన ఈ ద్వయం రెండు ఓవర్ల వ్యవధిలో పెవిలియన్ చేరింది. చివరి 8 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 124 పరుగులు అవసరమనగా… సుయాన్ష్ 13వ ఓవర్లో తిలక్ 6, 4, 4 తో 17 పరుగులు రాబట్టాడు. హెజిల్వుడ్ మరుసటి ఓవర్లో హార్దిక్.. 6, 4, 6, 4 బాదడంతో ముంబైలో గెలుపుపై ఆశలు చిగురించాయి. అదే జోష్‌ను ఆఖరి వరకు కొనసాగించినా కృనాల్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి ముంబైకి ఓటమి వైపు నిలిపాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన బెంగళూరుకు మొదటి ఓవర్ రెండో బంతికే తొలి దెబ్బ తగిలింది. తొలి ఓవర్లలో వికెట్లు తీయడం అలవాటుగా మార్చుకున్న ట్రెంట్ బౌల్ట్ (2020 సీజన్ నుంచి ఫస్ట్ ఓవర్లో బౌలింగ్ చేస్తూ అతడు తీసిన వికెట్లు-31).. రెండో బంతికే ఫిల్ సాల్ట్ (4)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. కానీ ఆ ఆనందం ముంబైకి ఎక్కువసేపు నిలువలేదు. పడిక్కల్ (22 బంతుల్లో 37, 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో జతకలిసిన కోహ్లీ.. బెంగళూరు స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు.
బౌల్ట్ 3వ ఓవర్లో మూడో బంతికి బ్యాక్వర్డ్ స్కేర్ లెగ్ దిశగా పడిక్కల్ భారీ సిక్సర్ బాదాడు. బుమ్రాకు కోహ్లీ సిక్సర్‌తో స్వాగతం పలికాడు. విల్ జాక్స్ 5వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టడంతో 5 ఓవర్లకే ఆర్సీబీ స్కోరు 50 పరుగుల మార్కును దాటింది. చాహర్ 6వ ఓవర్లో పడిక్కల్.. 6, 6, 4 బాదడంతో మ్యాచ్‌లో హార్దిక్ మళ్లీ అతడికి బంతినిచ్చే సాహసం చేయలేదు. స్లాగ్‌స్వీప్‌తో సిక్సర్‌గా మలిచిన కోహ్లీ.. 29 బంతుల్లోనే అర్ధసెంచరీని పూర్తిచేశాడు. కానీ అదే ఓవర్లో పడిక్కల్ ఔట్ కావడంతో 91 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
పడిక్కల్ స్థానంలో వచ్చిన సారథి పటీదార్.. క్రీజులో కుదురుకునేదాకా ఆచితూచి ఆడాడు. తానెదుర్కున్న తొలి 10 బంతుల్లో రజత్ చేసినవి 8 పరుగులే. కానీ హార్దిక్ 13వ ఓవర్ నుంచి రజత్ గేర్ మార్చాడు. ఆ ఓవర్లో రెండు బౌండరీలు రాబట్టిన అతడు.. శాంట్నర్ 14వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. కానీ కోహ్లీ.. హార్దిక్ 15వ ఓవర్లో డీప్ స్కేర్ వద్ద నమకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇదే ఓవర్లో లివింగ్స్టన్ బుమ్రా చేతికి చిక్కాడు. కానీ రజత్‌కు జితేశ్ జతకలవడంతో ముంబై బౌలర్లు బెంబేలెత్తిపోయారు. బౌల్ట్ 16వ ఓవర్లో జితేశ్.. 4,6 బాదగా రజత్ ఓ బౌండరీతో 18 పరుగులొచ్చాయి. ఇక హార్దిక్ 17వ ఓవర్లో అయితే ఈ ఇద్దరూ.. 23 పరుగులు పిండుకున్నారు. ఈ ద్వయం ఐదో వికెట్‌కు 27 బంతుల్లోనే 69 పరుగులు జోడించింది. చివరి నాలుగు ఓవర్లలో బెంగళూరు 70 పరుగులు పిండుకుంది.
ఈ మ్యాచ్‌లో 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దకు చేరగానే కోహ్లీ టీ20 ఫార్మాట్లో 13వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో కోహ్లీ 9 శతకాలు, 98 అర్ధ సెంచరీలు నమోదు చేయడం విశేషం. 386 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన కోహ్లీ ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలిచాడు. క్రిస్ గేల్ (14,562), అలెక్స్ హేల్స్ (13,610), షోయబ్ మాలిక్ (13,557), కీరన్ పొలార్డ్ (13,537) కోహ్లీ కంటే ముందున్నారు.
బెంగళూరు: 20 ఓవర్లలో 221/5 (కోహ్లీ 67, రజత్ 64, బౌల్ట్ 2/57, హార్దిక్ 2/45)
ముంబై: 20 ఓవర్లలో 209/9 (తిలక్ 56, హార్దిక్ 42, కృనాల్ 4/45, హాజిల్‌వుడ్ 2/37)