బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవాలలో భాగంగా బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది మృతుల కుటుంబాలకు ఆ జట్టు మేనేజ్మెంట్ ఆర్థిక సాయం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ఆర్సీబీ యాజమాన్యం.. ఈ దుర్ఘటనలో గాయపడ్డ క్షతగాత్రుల కోసం ‘ఆర్సీబీ కేర్స్’ పేరిట నిధులు సేకరించాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఆర్సీబీ సోషల్ మీడియా ఖాతాల వేదికలుగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘బెంగళూరులో బుధవారం జరిగిన ఘటన దురదృష్టకరం. ఇది మా ఆర్సీబీ కుటుంబాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. చనిపోయినవారి కుటుంబాలకు మద్దతుగా రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నాం. అలాగే ఈ దుర్ఘటనలో గాయపడి దవాఖానాల్లో చికిత్స పొందుతున్న వారికోసం ఆర్సీబీ కేర్స్ పేరిట నిధులు సేకరించాలని నిర్ణయించాం’ అని తెలిపింది.