Ravindra Jadeja | టీమ్ఇండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు. ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో సూపర్-4 మ్యాచ్‌లో ఒక వికెట్ పడగొట్టడం ద్వారా జడేజా అరుదైన క్లబ్లో అడుగుపెట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో జడేజాకు ఇది 200వ వికెట్ కాగా.. దిగ్గజ కెప్టెన్, హర్యానా హరికేన్ కపిల్ దేవ్ తర్వాత బంతితో రెండొందల పైచిలుకు వికెట్లు, 2,500 పరుగులు చేసిన రెండో భారత ప్లేయర్‌గా నిలిచాడు.
దేశానికి తొలి ప్రపంచకప్ (1983) అందించిన కపిల్ దేవ్ వన్డే క్రికెట్లో 253 వికెట్లు పడగొట్టడంతో పాటు 3,783 పరుగులు చేయగా.. ప్రస్తుతం జడేజా 200 వికెట్లు, 2,578 రన్స్ ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో ఉన్నాడు. చాన్నాళ్లుగా జట్టులో అటు బ్యాటర్‌గా.. ఇటు బౌలర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న జడేజా.. వచ్చే నెల నుంచి స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో జట్టుకు కీలకం కానున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఆసియాకప్‌లో ఫైనల్ చేరిన టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో ప్రయోగాలకు పెద్ద పీట వేసింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు అవకాశం దక్కించుకోని సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఠాకూర్ తిలక్ వర్మకు తుది జట్టులో చోటు కల్పించారు. ఇందులో తెలంగాణ కుర్రాడు తిలక్‌కు ఇది అంతర్జాతీయ స్థాయిలో తొలి వన్డే మ్యాచ్ కావడం విశేషం. శ్రేయస్ అయ్యర్ ఇంకా కోలుకోకపోగా.. పని భారాన్ని దృష్టిలో పెట్టుకొని విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌కు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది.