Champions Trophy | రావల్పిండి: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓటమి ఆతిథ్య పాకిస్థాన్ చావుకొచ్చింది. సోమవారం రావల్పిండి వేదికగా కివీస్‌తో కీలక పోరులో బంగ్లాదేశ్.. 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో బంగ్లాతో పాటు డిఫెండింగ్ చాంపియన్ పాక్ కూడా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్-ఏలో టాప్-2లో నిలిచిన భారత్, కివీస్ సెమీస్ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. ఇటీవలే ముక్కోణపు వన్డే సిరీస్‌లో గాయపడి తిరిగి రీఎంట్రీ ఇచ్చిన రచిన్ రవీంద్ర (105 బంతుల్లో 112, 12 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో చెలరేగడంతో బంగ్లా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్.. 46.1 ఓవర్లలో 240 పరుగులు చేసింది. రచిన్‌తో పాటు లాథమ్ (55) మెరిశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హోసేన్ శాంతో (110 బంతుల్లో 77, 9 ఫోర్లు), జేకర్ అలీ (45) ఆ జట్టును ఆదుకున్నారు. కివీస్ స్పిన్నర్ మైఖెల్ బ్రాస్‌వెల్ (4/26), విలియమ్ ఓరూర్క్ (2/48) బంగ్లాను కట్టడిచేశారు. లీగ్ దశలో కివీస్.. మార్చి 2న దుబాయ్‌లో టీమ్ఇండియాతో తలపడనుంది.
రచిన్.. దంచెన్
స్వల్ప విరామం తర్వాత ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన రచిన్.. కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఛేదనలో 15 పరుగులకే న్యూజిలాండ్ రెండు కీలక వికెట్లు కోల్పోయిన వేళ బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. కాన్వేతో మూడో వికెట్‌కు 57, లాథమ్‌తో నాలుగో వికెట్‌కు 129 రన్స్ జోడించాడు. 95 బంతుల్లో శతకం పూర్తిచేసిన రచిన్.. ఐసీసీ టోర్నీ (వన్డే)లలో కివీస్ తరఫున అత్యధిక శతకాలు (11 ఇన్నింగ్స్‌లలో 4) బాదిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు కేన్ విలియమ్సన్ (34 ఇన్నింగ్స్‌లలో 3) పేరిట ఉండేది.
బ్రాస్‌వెల్ ధాటికి విలవిల
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు తాంజిద్ హసన్ (24), శాంతో తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించి మంచి ఆరంభమే ఇచ్చారు. కానీ బ్రాస్‌వెల్, ఓరూర్క్ క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టారు. 9వ ఓవర్లో తాంజిద్ను బ్రాస్‌వెల్ ఔట్ చేయగా మిరాజ్ (13)ను ఓరూర్క్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత బ్రాస్‌వెల్ వరుస ఓవర్లలో తౌహిద్ (7), ముష్ఫీకర్ (2), మహ్మదుల్లా (4)ను బోల్తా కొట్టించాడు. శాంతో క్రీజులో పాతుకుపోయినా అతడు వేగంగా పరుగులు సాధించలేకపోయాడు. ఆఖర్లో జేకర్, రిషద్ (26) బంగ్లా పరువు నిలిపారు.ప్చ్.. పాక్! ఐదు రోజుల్లోనే ఔట్
లాహోర్: రాక రాక వచ్చిన ఆతిథ్య హక్కులు! వాటిని కాపాడుకోవడానికి రెండేండ్లపాటు పడ్డ శ్రమ!! భద్రతా కారణాలతో భారత్.. పాక్‌కు వెళ్లననడం, అందుకు ఆ దేశం మొండిపట్టు పట్టి ‘హైబ్రిడ్ మోడల్’కు ససేమిరా ఒప్పుకోకపోవడంతో అసలు టోర్నీ అక్కడ జరుగుతుందా? లేదా? అన్న ఆందోళన. ఎట్టకేలకు పీసీబీ అందుకు ఒప్పుకున్నాక.. స్వదేశంలో తమ జట్టు ఐసీసీ టోర్నీని ముద్దాడితే చూద్దామని యావత్ దేశం కన్న కలలు కల్లలే అయ్యాయి. ఈనెల 19న మొదలైన పాకిస్థాన్ ట్రోఫీ వేట.. ఐదంటే ఐదు రోజుల్లో రెండు మ్యాచ్‌లతోనే ముగిసింది. తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఓడిన పాక్.. రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి టీమ్ఇండియా చేతిలోనూ ఘోరంగా ఓడిపోయి టోర్నీ నుంచి అనధికారికంగా నిష్క్రమించింది. తాజాగా బంగ్లాదేశ్.. కివీస్ చేతిలో ఓడటంతో ఈ టోర్నీ నుంచి డిఫెండింగ్ చాంపియన్ నిష్క్రమణ అధికారికంగా ఖరారైంది. తమ అభిమాన ఆటగాళ్ల మెరుపులను టోర్నీ ఆసాంతం వీక్షిద్దామని కలలు కన్న పాక్ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశలో ముంచెత్తుతూ రిజ్వాన్ సేన ఐదు రోజుల్లోనే తమ పోరాటాన్ని చాలించింది.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్: 50 ఓవర్లలో 236/9 (శాంతో 77, జేకర్ 45, బ్రాస్‌వెల్ 4/26, ఓరూర్క్ 2/48);న్యూజిలాండ్: 46.1 ఓవర్లలో 240/5 (రచిన్ 112, లాథమ్ 55, టస్కిన్ 1/28, ముస్తాఫిజుర్ 1/42)