Ravi Shastri : అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాల రికార్డు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరిట ఉన్న విషయం తెలిసిందే. వంద సెంచరీలతో మాస్టర్ బ్లాస్టర్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అతడి రికార్డును బ్రేక్ చేసేవాళ్లలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ముందు వరుసలో ఉన్నాడు. అయితే.. విరాట్ కోహ్లీకి ఆ రికార్డు బద్ధలు కొట్టడం అంత సులభం కాదని మాజీ కోచ్ రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు. అందుకు కారణాలు కూడా అతను చెప్పుకొచ్చాడు.
‘అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు కొట్టింది ఒక్కడే. ఎవరైనా ఆ రికార్డును బ్రేక్ చేస్తారంటే అది చాలా గొప్ప విషయం. మరొక క్రికెటర్ ఆ రికార్డను బద్ధలు కొట్టాలంటే అతను ఎక్కువ క్రికెట్ ఆడాలి. ఫిట్‌గా ఉండాలి. అప్పుడే అతను వంద సెంచరీలు కొట్టగలడు. నా అభిప్రాయం ప్రకారం.. కోహ్లీ ఇంకో 5-6 ఏళ్లు ఆడతాడు. ఆలోపు అతను 25 సెంచరీలు కొట్టి సచిన్ రికార్డు బ్రేక్ చేయడ నిజంగా పెద్ద ఛాలెంజ్’ అని రవి శాస్త్రి వెల్లడించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతక వీరుల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 71 సెంచరీలతో మూడో ప్లేస్‌లో నిలిచాడు. గత ఏడాది ఫామ్ అందుకున్న కోహ్లీ ఆసియా కప్‌లో శ్రీలంకపై సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లోనూ చెలరేగాడు. బంగ్లాదేశ్ పర్యటనలో వన్డేల్లో సెంచరీ బాదాడు. స్వదేశంలో శ్రీలంక సిరీస్‌లో రెండు శతకాలు కొట్టాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో మూడంకెల స్కోర్ అందుకున్నాడు. అతను టెస్టు ఫార్మాట్లో మూడేళ్ల తర్వాత సెంచరీ కొట్టాడు. దాంతో, మూడు ఫార్మాట్లలో 75 శతకాలను ఖాతాలో వేసుకున్నాడు.