Hyderabad | హైదరాబాద్, ఆట ప్రతినిధి: లెఫ్టార్మ్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 7 వికెట్లతో సత్తాచాటడంతో.. రంజీట్రోఫీ ప్లేట్ గ్రూప్ సెమీఫైనల్లో హైదరాబాద్ విజయానికి బాటలు వేసుకుంది. నాగాలాండ్‌తో జరుగుతున్న పోరులో హైదరాబాద్ 462/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన నాగాలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు ఆలౌటైంది.
జాషువ (50) టాప్ స్కోరర్ కాగా.. మన బౌలర్లలో తనయ్ 7, రవితేజ రెండు వికెట్లు తీశారు. భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంతో హైదరాబాద్ జట్టు ప్రత్యర్థికి ఫాలోఆన్ విధించింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నాగాలాండ్.. శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న నాగాలాండ్.. మన స్కోరుకు ఇంకా 236 పరుగుల దూరంలో ఉంది.