ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 06, 2020 , 17:13:00

IPL 2020: ముంబైతో రాజస్థాన్‌ ఢీ.. ఫేవరెట్‌గా రోహిత్‌సేన

IPL 2020: ముంబైతో రాజస్థాన్‌  ఢీ.. ఫేవరెట్‌గా రోహిత్‌సేన

అబుదాబిఫ: ఐపీఎల్‌-13లో మంగళవారం ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.   వరుసగా రెండు  ఓటములతో ఢీలాపడిన  రాజస్థాన్‌  బలమైన ముంబైతో తలపడనుంది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై  గత రెండు మ్యాచ్‌ల్లో  అన్ని విభాగాల్లోనూ  గొప్పగా రాణించింది.  బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆ జట్టు అనూహ్య ప్రదర్శన చేస్తోంది. ఒకవేళ టాపార్డర్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ విఫలమైనా   ఆఖర్లో  హార్దిక్‌ పాండ్య, పొలార్డ్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోరు అందిస్తున్నారు.

పటిష్ఠ బౌలింగ్‌ దళం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నది. పాటిన్సన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా పదునైన బంతులతో రెచ్చిపోతున్నారు. వరుస విజయాలతో జోరుమీదున్న రోహిత్‌ సేన మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగుతున్నది. మరోవైపు, జట్టులో ప్రతిభగల ఆటగాళ్లు, హిట్టర్లు ఉన్నా రాజస్థాన్‌ కీలక సమయాల్లో చేతులెత్తేస్తున్నది. గత శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌  దిగిన  రాజస్థాన్‌ పవర్‌ప్లే కూడా ముగియకముందే  టాపార్డర్‌ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.   పసలేని రాజస్థాన్‌ బౌలింగ్‌ను బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ అలవోకగా ఎదుర్కోని ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించారు. ఈ మ్యాచ్‌లో తప్పిదాలను సరిదిద్దుకొని ముంబైకి గట్టిపోటీనివ్వాలని స్టీవ్‌స్మిత్‌ సేన భావిస్తోంది.  ఓపెనర్‌గా జోస్‌ బట్లర్‌ విఫలమవడం ఆ జట్టును ఆందోళన కలిగిస్తోంది. అలాగే, తుది  జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు ఆ జట్టు సారథి స్మిత్‌ ప్రకటించాడు.