గువాహటి : ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన పోరులో రాజస్థాన్ 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ విజయాలతో రాయల్స్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. రాజస్థాన్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై 123/9 స్కోరుకు పరిమితమైంది. బర్గర్, బిష్ణోయ్, సందీప్ రెండేసి వికెట్లు తీశారు. టాపార్డర్ త్రయం రోహిత్‌శర్మ(5), రికల్టన్(8), సూర్యకుమార్(6)తో సహా కెప్టెన్ హార్దిక్‌పాండ్యా(9), తిలక్‌వర్మ(14) ఘోరంగా విఫలమయ్యారు. వర్షం అంతరాయం కారణంగా సుమారు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. కాగా ప్రత్యర్థి ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. 11 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (32 బంతుల్లో 77*, 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ శతకానికి తోడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో 39, 1 ఫోర్, 5 సిక్స్‌లు) వీరవిహారంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది.
4, 6, 4, 4, 4.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్స్‌కు తొలి ఓవర్లోనే జైస్వాల్ అందించిన ఆరంభమది. 3.2 ఓవర్లకు కుదించిన పవర్ ప్లేలో జైస్వాల్, వైభవ్ కండల్లో కరెంటు నింపుకుని వచ్చినట్టుగా దొరికిన బంతిని దొరికినట్టుగా బౌండరీ లైన్ దాటించడంతో రాయల్స్ రన్‌రేట్ 20కి తగ్గకుండా సాగింది. ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్.. బుమ్రాను ఎలా ఎదుర్కుంటాడనేదానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూడగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ బీహార్ కుర్రాడు స్టార్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బుమ్రా, బౌల్ట్‌ను క్లబ్ స్థాయి బౌలర్లుగా మార్చేసి ధనాధన్ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. బుమ్రా బౌలింగ్‌లో తాను ఎదుర్కున్న తొలి నాలుగు బంతుల్లో రెండు భారీ సిక్స్‌లు బాదిన అతడు ఆ తర్వాత బౌల్ట్ ఓవర్లోనూ స్కేర్ లెగ్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. శార్దూల్ ఐదో ఓవర్లోనూ 6, 4, 6 దంచిన వైభవ్.. ఆఖరి బంతికి ఎక్స్ట్రా కవర్స్ మీదుగా భారీ షాట్ ఆడినా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మకు చిక్కడంతో ముంబై ఊపిరి పీల్చుకుంది. తొలి వికెట్‌కు ఈ జోడీ 4.6 ఓవర్లలోనే 80 రన్స్ జతచేయడం విశేషం. ఆ తర్వాత జురెల్ (2)ను గజన్ఫర్ పెవిలియన్‌కు పంపగా హార్ధిక్ 8వ ఓవర్లో బౌండరీతో యశస్వీ వరుసగా రెండో ఫిఫ్టీని పూర్తిచేశాడు. రెండు సిక్స్‌లు, ఒక బౌండరీతో ఊపు మీద కనిపించిన కెప్టెన్ పరాగ్ (20)నూ గజన్ఫర్ బోల్తా కొట్టించాడు. శార్దూల్ విసిరిన ఆఖరి ఓవర్లో 18 రన్స్ రాబట్టిన జైస్వాల్.. ఇన్నింగ్స్‌కు అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
11 ఓవర్లలో 151 పరుగుల ఛేదనతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆర్చర్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఆఖరి బంతికి రికల్టన్‌ను ఔట్ చేసి అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. భారీ సిక్స్‌తో దూకుడు మీద కనిపించిన రికల్టన్..మరో షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్ చేతికి చిక్కాడు. వచ్చి రావడంతోనే తనదైన శైలిలో సిక్స్ కొట్టిన సూర్యకుమార్ ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. బర్గర్ బౌలింగ్‌లో బౌండరీ దగ్గర ఆర్చర్ క్యాచ్‌తో రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. రెండు పరుగుల తేడాతో రోహిత్‌శర్మ..సందీప్‌శర్మ బౌలింగ్‌లో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు, బౌలింగ్ మార్పుగా వచ్చిన స్పిన్నర్ రవి బిష్ణోయ్ మూడు బంతుల వ్యవధిలో హార్దిక్‌తో పాటు తిలక్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ముంబై 46 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో రూథర్‌ఫర్డ్(25), నమన్ ధీర్(25) దూకుడుగా ఆడినా..ముంబై గెలుపు వాకిట నిలువలేకపోయింది.
రాజస్థాన్: 11 ఓవర్లలో150/3 (జైస్వాల్ 77*, వైభవ్ 39, గజన్ఫర్ 2/21, శార్దూల్ 1/36);
ముంబై: 11 ఓవర్లలో 123/9 (రూథర్‌ఫర్డ్ 25, నమన్ 25, బిష్ణోయ్ 2/25, బర్గర్ 2/21)
