ఢిల్లీ : స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత జట్టు 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మూడో రోజు తర్వాత విండీస్ పోరాటంతో ఫలితం ఐదో రోజుకు వాయిదాపడిన మ్యాచ్‌లో పర్యాటక జట్టు నిర్దేశించిన 121 పరుగుల ఛేదనను టీమ్ఇండియా.. ఎలాంటి నాటకీయతకూ చోటివ్వకుండా మంగళవారం ఉదయం సెషన్లోనే పూర్తిచేసింది. కేఎల్ రాహుల్ (108 బంతుల్లో 58 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో అర్ధ శతకంతో రాణించాడు. విజయం ముంగిట సాయి (39), గిల్ (13) నిష్క్రమించినా ధ్రువ్ జురెల్ (6 నాటౌట్) అండతో రాహుల్ లాంఛనాన్ని పూర్తిచేశాడు. మ్యాచ్‌లో 8 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ లభించాయి. కాగా స్వదేశంలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తొలి సిరీస్‌నే గిల్ 2-0తో గెలుచుకోవడం విశేషం.
విజయానికి 58 పరుగుల దూరంలో ఐదో రోజు (63/1 ఓవర్‌నైట్ స్కోరు) ను ఆరంభించిన టీమ్ఇండియా స్వల్ప వ్యవధిలో సాయి, గిల్ వికెట్లను కోల్పోయింది. కానీ రాహుల్ మాత్రం వేగంగా ఆడేందుకు యత్నించాడు. 28వ ఓవర్లో పియారె బౌలింగ్‌లో 6,4 బాదిన అతడు.. వారికన్ బౌలింగ్‌లోనూ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు. విండీస్ సారథి రోస్టన్ చేజ్.. సాయితో పాటు తాను వేసిన 33వ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన గిల్‌నూ ఔట్ చేశాడు. వారికన్ బౌలింగ్‌లో బౌండరీతో హాఫ్ సెంచరీని పూర్తిచేసుకున్న రాహుల్ అతడే వేసిన 36వ ఓవర్లో బౌండరీతో విన్నింగ్ రన్స్ కొట్టాడు. వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది వరుసగా పదో టెస్టు సిరీస్ విజయం. 2002 నుంచి మెన్ ఇన్ బ్లూ.. విండీస్‌తో ఆడిన ఒక్క టెస్టులోనూ (మొత్తంగా 27 టెస్టు విజయాలు) ఓడిపోలేదు.
ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు 12 కీలక పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. ఈ సైకిల్లో ఇప్పటివరకూ 7 టెస్టులాడిన గిల్ సేన.. 4 విజయాలు, 2 ఓటములు, ఒక డ్రాతో 52 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, శ్రీలంక తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ సిరీస్ తర్వాత గిల్ సేన.. నవంబర్‌లో స్వదేశంలోనే దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది.
కోట్లా పిచ్‌పై భారత జట్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మ్యాచ్ ముగిశాక హెడ్‌కోచ్ గౌతం గంభీర్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. ‘మేం ఇక్కడ ఇంకా మెరుగైన వికెట్‌ను ఆశించాం. ఈ టెస్టులో ఫలితం ఐదో రోజు వచ్చినప్పటికీ పిచ్ పేసర్లకు అనుకూలించే విధంగా ఉంటే బాగుండేది. ఉపఖండపు పిచ్‌లపై స్పిన్నర్లు కీలకపాత్ర పోషిస్తారని అందరికీ తెలుసు. కానీ జట్టులో ఇద్దరు ప్రీమియమ్ పేసర్లు ఉన్నప్పుడు వాళ్లు కూడా రాణించాలని కోరుకుంటాం కదా. రాబోయే రోజుల్లో టెస్టు క్రికెట్‌ను సజీవంగా ఉంచడానికి గాను బంతికి బ్యాట్‌కు సమానంగా అనుకూలించే విధంగా మనం పిచ్‌లను రూపొందించాలి’ అని అన్నాడు. ఢిల్లీ టెస్టులో భారత బౌలర్లు 20 వికెట్లు తీస్తే అందులో స్పిన్నర్లకు దక్కినవే 13. కోట్లా పిచ్ సంప్రదాయకంగా స్లో టర్నర్ అయినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు తీసేందుకు జడేజా, కుల్దీప్, వాషింగ్టన్ తంటాలుపడ్డారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 518/5;
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 248;
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 390;
భారత్ రెండో ఇన్నింగ్స్: 35.2 ఓవర్లలో 124/3 (రాహుల్ 58*, సాయి 39, చేజ్ 2/36 వారికన్ 1/39)