శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Feb 16, 2021 , 03:25:55

అశ్విన్‌ అద్భుతః

అశ్విన్‌ అద్భుతః

  • శతక్కొట్టిన చెన్నై చిన్నోడు
  • భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 286
  • ఇంగ్లండ్‌ లక్ష్యం 482 
  • ప్రస్తుతం 53/3

బంతి బొంగరంలా తిరుగుతున్న చెపాక్‌ పిచ్‌పై అశ్విన్‌ క్లాసిక్‌ సెంచరీతో రెచ్చిపోవడంతో భారీ టార్గెట్‌ నిర్దేశించిన టీమ్‌ఇండియా.. తొలి టెస్టులో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునేందుకు సిద్ధమైంది. సిరీస్‌ సమం చేసేందుకు కోహ్లీసేన మరో ఏడు వికెట్లు పడగొట్టాల్సి ఉండగా.. పరాజయం తప్పించుకునేందుకు ఇంగ్లండ్‌ 429 పరుగుల దూరంలో ఉంది. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన రూట్‌ సేన.. తొలి సెషన్‌లోనే తలవంచుతుందా.. లేక రోజంతా పోరాడి ఆశలు నిలుపుకుంటుందా అనేది ఆసక్తికరం! 

చెన్నై: ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో అదరగొట్టిన టీమ్‌ఇండియా రెండో టెస్టులో విజయానికి చేరువైంది. పరీక్ష పెడుతున్న పిచ్‌పై ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (149 బంతుల్లో 106; 14 ఫోర్లు, ఒక సిక్సర్‌) సూపర్‌ సెంచరీతో కదం తొక్కడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసింది. మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. సొంత మైదానంలో అశ్విన్‌ శతక్కొట్టగా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (62) హాఫ్‌సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ, జాక్‌ లీచ్‌ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 195 పరుగులతో కలుపుకొని టీమ్‌ఇండియా ఓవరాల్‌గా 482 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్‌ ముందుంచింది. భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. చేతిలో ఏడు వికెట్లు ఉన్న ఇంగ్లిష్‌ జట్టు.. విజయానికి ఇంకా 429 పరుగుల దూరంలో ఉంది. జాక్‌ లారెన్స్‌ (19), జో రూట్‌ (2) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్‌ రెండు, అశ్విన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించడం దాదాపు ఖాయం కాగా.. ఇంగ్లండ్‌ పరాజయం నుంచి తప్పించుకోవాలంటే అద్భుతం జరుగాల్సిందే.

  • కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ స్పిన్‌ బౌలింగ్‌లో ఔటవడం నాలుగేండ్ల తర్వాత ఇదే తొలిసారి. 2016 ఇండోర్‌లో న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ జతిన్‌ చేతిలో కోహ్లీ రెండుసార్లు ఔటయ్యాడు. 
  • ఒకే టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టడంతో పాటు సెంచరీ చేయడం అశ్విన్‌కు ఇది మూడోసారి. ఇంగ్లండ్‌ దిగ్గజం ఇయాన్‌ బోథమ్‌ ఐదుసార్లు ఈ ఫీట్‌ నమోదు చేశాడు.
  • టెస్టుల్లో అశ్విన్‌కు ఇది ఐదో సెంచరీ. గత నాలుగు శతకాలు వెస్టిండీస్‌పైనే వచ్చాయి.

ఒక్క రోజులోనే అద్భుతాలు జరిగిపోవు. బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ పర్యవేక్షణలో గత కొన్నాళ్లుగా నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇది. మళ్లీ ఇక్కడ (చెన్నైలో) మ్యాచ్‌ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఈ ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా. గతంలోనూ నేను సెంచరీ చేసినప్పుడు ఇషాంత్‌ మరో ఎండ్‌లో ఉన్నాడు. ఈసారి అతడు ఔటవడంతో కాస్త కంగారు పడ్డా. సిరాజ్‌ ఏం చేస్తాడో అనుకున్నా. నా శతకం పూర్తైన సమయంలో అతడి ఉత్సాహం కట్టిపడేసింది. మైదానంలో అభిమానుల కేరింతలు మరింత బలాన్నిస్తాయి.  

-అశ్విన్‌


స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 329, ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 134, భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (స్టంప్డ్‌) ఫోక్స్‌ (బి) లీచ్‌ 26, గిల్‌ (ఎల్బీ) లీచ్‌ 14, పుజారా (రనౌట్‌) 7, కోహ్లీ (ఎల్బీ) అలీ 62, పంత్‌ (స్టంప్డ్‌) ఫోక్స్‌ (బి) లీచ్‌ 8, రహానే (సి) పోప్‌ (బి) అలీ 10, అక్షర్‌ (ఎల్బీ) అలీ 7, అశ్విన్‌ (బి) స్టోన్‌ 106, కుల్దీప్‌ (ఎల్బీ) అలీ 3, ఇషాంత్‌ (సి) స్టోన్‌ (బి) లీచ్‌ 7, సిరాజ్‌ (నాటౌట్‌) 16, ఎక్స్‌ట్రాలు: 20, మొత్తం: 286, వికెట్ల పతనం: 1-42, 2-55, 3-55, 4-65, 5-86, 6-106, 7-202, 8-210, 9-237, 10-286, బౌలింగ్‌: స్టోన్‌ 6.5-1-21-1, లీచ్‌ 33-6-100-4, అలీ 32-7-98-4, రూట్‌ 4-0-15-0, బ్రాడ్‌ 9-3-25-0, లారెన్స్‌ 1-0-7-0.

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (సి) కోహ్లీ (బి) అశ్విన్‌ 25, సిబ్లే (ఎల్బీ) అక్షర్‌ 3, లారెన్స్‌ (నాటౌట్‌) 19, లీచ్‌ (సి) రోహిత్‌ (బి) అక్షర్‌ 0, రూట్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 53/3. వికెట్ల పతనం: 1-17, 2-49, 3-50, బౌలింగ్‌: ఇషాంత్‌ 2-1-6-0, అక్షర్‌ 9-3-15-2, అశ్విన్‌ 8-1-28-1.


VIDEOS

logo