PV Sindhu | భారత స్టార్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన పీవీ సింధు.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి పరిమితమైంది. నిరుడు బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన అనంతరం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఈ తెలుగమ్మాయి.. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానాలు కోల్పోయి 15వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే టాప్-10లో చోటు కోల్పోయిన సింధు.. ఇప్పుడు మరో ఐదు ర్యాంక్‌లు కిందకు దిగింది. ప్రస్తుతం సింధు ఖాతాలో 51,070 పాయింట్లు ఉన్నాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత కోర్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న సింధు.. కెనాడా ఓపెన్ సూపర్ 500 టోర్నీలో తలపడుతున్నది.
ఈ సీజన్లో ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయిన సింధు.. మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ సూపర్-300 టోర్నీలో ఫైనల్‌కు చేరింది. ఈ ఏడాది సింధుకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. మలేషియా మాస్టర్స్ సూపర్-500 టోర్నీలో సెమీస్ వరకు వచ్చిన తెలుగమ్మాయి.. మిగిలిన టోర్నీల్లో తొలి రౌండ్లలోనే పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట మూడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 8వ స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున ఇదే అత్యుత్తమం కాగా.. లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ వరుసగా 19వ, 20వ ర్యాంక్‌లు దక్కించుకున్నారు. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జంట ఒక స్థానం కోల్పోయి 17వ ర్యాంక్‌లో నిలిచింది.