జకర్తా: ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్ విఘ్నాలను దాటి ప్రిక్వార్టర్స్ చేరుకున్నారు. ఇటీవలే ముగిసిన ఇండియా ఓపెన్‌లో నిరాశపరిచిన సింధు.. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 22-20, 21-18తో ఐదో సీడ్ మనామి సుయిజు (జపాన్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్.. 21-15, 21-23, 24-22తో కొకి వతనబె (జపాన్)తో జరిగిన హోరాహోరీ పోరులో విజయం సాధించాడు.
లక్ష్యసేన్.. 21-13, 16-21, 21-14తో వాంగ్ జు వీ (తైవాన్)ను మట్టికరిపించాడు. కానీ సీనియర్ షట్లర్లు కిరణ్ జార్జి 17-21, 14-21తో ఉబైదుల్లా (ఇండోనేషియా) చేతిలో ఓడగా, హెచ్ఎస్ ప్రణయ్ 19-21, 11-21తో లీ జి జియా (మలేషియా) కు తలవంచాడు. మహిళల సింగిల్స్‌లో సింధుతో పాటు అన్మోల్ ముందంజ వేయగా తన్వి శర్మ, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్‌కే ఇంటిబాట పట్టారు.