IPL -2024 | ఐపీఎల్-2024 సీజన్ లో భాగంగా బుధవారం గువాహటిలో జరిగిన 65వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుపై పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ విధించిన 145 పరుగుల విజయ లక్ష్యాన్ని ఏడు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి పంజాబ్ విజయాన్ని సొంతం చేసుకున్నది. పంజాబ్ కింగ్స్ సారధి శామ్ కుర్రాన్ 63 పరుగులతో నాటౌట్ గా నిలవగా, రీలీ రొస్కో 22, జితేశ్ శర్మ 22 పరుగులు చేశారు. చివరగా అశుతోష్ శర్మ 17 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ ఒకటి, అవేష్ ఖాన్, యుజువేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లు తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 48, రవిచంద్రన్ అశ్విన్ 28 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. పంజాబ్ బౌలర్లలో శామ్ కురాన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహల్ చెరో రెండు వికెట్లు, అర్షదీప్ సింగ్, నాథన్ ఎల్లిస్ చెరో వికెట్ తీశారు.