న్యూఢిల్లీ: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer)కు ఫైన్ పడింది. అతనికి 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా అతనికి ఫైన్ వేశారు. చెన్నైతో మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నిర్దేశిత సమయంలో పంజాబ్ జట్టు తమ ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం అయ్యర్‌కు జరిమానా వేశారు.
ప్లేఆఫ్స్ రేసులో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో చెన్నైపై పంజా విసిరింది పంజాబ్ జట్టు. శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. హోంగ్రౌండ్లో ఐదో ఓటమిని ఖాతాలో వేసుకున్న చెన్నై ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నది. చెన్నై నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.4 ఓవర్లలో అందుకున్నది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(41 బంతుల్లో 72, 5ఫోర్లు, 4సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్‌సింగ్(36 బంతుల్లో 54, 5ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. పతిరన(2/45), ఖలీల్(2/28) రెండేసి వికెట్లు తీశారు.
తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. 19.2 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్ కరన్ (47 బంతుల్లో 88, 9 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (32) రాణించారు. కింగ్స్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ (4/32) ఈ సీజన్లో తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. అర్ష్‌దీప్ (2/25), యాన్సెన్ (2/30) తలా రెండు వికెట్లు పడగొట్టారు. అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.