IPL 2025 : ఐపీఎల్ పద్దెనిమదో సీజన్లో సమీకరణాలు మారుతున్నాయి. ఫేవరెట్ జట్లు సైతం కుదేలవుతున్నాయి. హ్యాట్రిక్ విజయాలు కొడుతుందనుకున్న పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఓటమి పాలైంది. మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టేమో వరుసగా నాలుగు మ్యాచుల్లో పరాజయం పాలైంది. భారీ ఛేదనలో చతికిలపడుతున్న సీఎస్కే.. మంగళవారం పంజాబ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చెన్నై మాజీ సారథి ఎంఎస్ ధోనీ(MS Dhoni)పై పంజాబ్ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఐపీఎల్లో మహేంద్ర సింగ్ ధోనీ ఒక లెజెండ్. నలభైల్లోనూ అతడు వికెట్ కీపింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో బ్యాటర్ క్రీజు దాటడమే ఆలస్యం.. రెప్పపాటులోనే స్టంపింగ్స్ చేస్తున్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. కొన్నేళ్లుగా అతడు ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. 10- 12 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు ధోనీ. 18వ సీజన్లో పెద్దగా టచ్‌లో ఉన్నట్టు అనిపించం లేదు. ఈ ఎడిషన్‌లో అతడి ఫామ్‌ను బట్టి వీడ్కోలుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. సీఎస్కే చాలా గట్టి టీమ్. ఆ జట్టుతో మ్యాచ్‌ను తేలికగా తీసుకోము’ అని పాంటింగ్ అన్నాడు.
ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి తడబడుతోంది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర వైఫల్యం.. మిడిలార్డర్ విఫలం కావడంతో పెద్ద లక్ష్యాల్ని ఛేదించలేక పోతుంది. గత సీజన్లలో మెరుపులు మెరిపించిన ధోనీ సైతం మునపటిలా ఆడడం లేదు. మోకాళ్ల నొప్పి సమస్యతో బాధ పడుతున్న అతడు.. సుదీర్ఘ సమయం బ్యాటింగ్ చేసే పరిస్థితి లేదు. ఇప్పటివరకూ 4 మ్యాచుల్లో మహీ 76 రన్స్ చేశాడంతే. మంగళవారం పంజాబ్ సొంత ఇలాకా ముల్లనూర్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్.. 9వ స్థానంలో ఉన్న చెన్నై ముందంజ వేసేందుకు ఇది కీలకమైన మ్యాచ్.