కట్టంగూర్, ఏప్రిల్ 7 : ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మానసిక దివ్యాంగుడు మృతి చెందిన సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పరడ గ్రామానికి చెందిన కాసర్ల శ్రీనివాస్ రెడ్డి (47) పుట్టుకతో మానసిక దివ్యాంగుడు. 25 సంవత్సరాల క్రితం పెండ్లి అయింది. పెళ్లైన 3 సంవత్సరాలకే భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. కాగా ఈ నెల 2వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాస్‌రెడ్డి రాత్రి వరకు తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇండ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు.
సోమవారం ఈదులూరు గ్రామ శివారులో మారబోయిన కళమ్మ వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని బయటికి తీయగా శ్రీనివాసరెడ్డిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.రవీందర్ తెలిపారు.