Prithvi Shaw : రంజీ ట్రోఫీలో భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) మళ్లీ జోరు చూపిస్తున్నాడు. ఈ సీజన్‌కు ముందే మహారాష్ట్ర (Maharashtra) జట్టులో చేరిన షా.. తనపై మేనేజ్మెంట్ పెట్టుకున్ననమ్మకాన్ని నిలబెడుతూ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఛండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వీరవిహారం చేసిన ఈ చిచ్చరపిడుగు జట్టుకు భారీ స్కోర్ అందించాడు. తన విధ్వంసక ఆటతో ప్రత్యర్థి బౌలర్లను వణికించిన పృథ్వీ ఎలైట్ గ్రూప్ డీలోని మహారాష్ట్ర విజయానికి బాటలు వేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే ఔటై నిరాశపరిచిన పృథ్వీ రెండో ఇన్నింగ్స్‌తో తడాఖా చూపించాడు. మునపటి షాను తలపించిన అతడు.. బౌండరీలతో చెలరేగుతూ ద్విశతకం బాదేశాడు. ఆకాశమే హద్దుగా ఉతికేసిన ఈ డాషింగ్ బ్యాటర్ 156 బంతుల్లో 25 ఫోర్లు, 5 సిక్సర్లతో 222 పరుగులు సాధించాడు. దాంతో.. మహారాష్ట్ర 359-3 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
Prithvi Shaw in Ranji trophy this season :
– 0(4), 75(102), 8(9) & 222(156).
Prithvi Shaw is in good form in domestic cricket. He is unsold in IPL 25.
Which team buy him in IPL 26 ? pic.twitter.com/lKAYHEUF5H
— VIKAS (@Vikas662005) October 27, 2025
అనంతరం భారీ ఛేదనకు దిగిన ఛండీగఢ్ ఓపెనర్ వికెట్ కోల్పోయింది. కానీ, క్రీజులో పాతుకుపోయిన అర్జున్ ఆజాద్(63 నాటౌట్), మానన్ వోహ్రా(53 నాటౌట్) అర్ధ శతకాలతో ఆజేయంగా మూడో రోజును ముగించారు. నాలుగో రోజు ఛండీగఢ్ విజయానికి 335 రన్స్ కావాలి. తొలి ఇన్నింగ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ (116) ఒక్కడే సెంచరీతో రాణించగా 313 రన్స్ చేసింది మహారాష్ట్ర. ఆ తర్వాత దీటుగా బదులివ్వాలనుకున్న ప్రత్యర్థిని వికీ ఒత్సవల్ ఆరు వికెట్లతో దెబ్బకొట్టాడు. దాంతో, ఛండీగఢ్ టీమ్ 209కే ఆలౌటయ్యింది.