న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుపై అభినందనల జడివాన కురుస్తూనే ఉన్నది. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు ఫలించిన వేళ అమ్మాయిల అద్భుత ప్రదర్శనకు అందరూ కితాబిస్తున్నారు. గురువారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భేటీలో ప్రపంచకప్ గెలిచిన మహిళా క్రికెటర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు.
రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ముర్ము మాట్లాడుతూ ‘చారిత్రక విజయం సాధించిన భారత జట్టుకు శుభాకాంక్షలు. అమ్మాయిలు చరిత్ర సృష్టించడం వరకే పరిమితం కాలేదు, భవిష్యత్ యువతరానికి స్ఫూర్తిగా నిలిచారు. మహిళల జట్టు భారత్‌ను ప్రతిబింబిస్తున్నది. దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, విభిన్న నేపథ్యాల నుంచి, వేర్వేరు పరిస్థితుల నుంచి వచ్చినా భారత జట్టుగా చిరస్మరణీయ విజయం సాధించారు’ అని పేర్కొంది.