Preity Zinta | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్, అనిల్ కపూర్, రణ్వీర్ సింగ్ పలువురు బాలీవుడ్ నటులు రిటైర్మెంట్పై స్పందించారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ బ్యూటీ, ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా సైతం విరాట్ రిటైర్మెంట్పై తన అభిప్రాయం వెల్లడించింది. తాను విరాట్ కోసమే టెస్ట్ క్రికెట్ చూశానని ప్రీతి తెలిపింది. ఆటపై విరాట్‌కు ఉన్న మక్కువను ప్రశంసించింది.
టెస్ట్ క్రికెట్ ఇక ఎప్పటికీ ఒకేలా ఉండదంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. సోషల్ మీడియా ‘ఎక్స్’లో ఓ యూజర్ మేడమ్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారని విన్నప్పుడు మీ స్పందన ఏంటీ? అని ప్రశ్నించారు. దానికి ప్రీతి జింటా స్పందిస్తూ.. ‘నేను విరాట్ కోసమే టెస్ట్ క్రికెట్‌ను చూశాను. అతను ఆటను అభిరుచితో నింపాడు. టెస్ట్ క్రికెట్ మళ్లీ ఎప్పటికీ ఒకేలా ఉండదని నేను అనుకోను. భవిష్యత్తు కోసం అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన ప్రస్తుత భారత ఆటగాళ్లు విరాట్, రోహిత్, అశ్విన్ వంటి ఆటగాళ్లను భర్తీ చేయాల్సి ఉంటుంది’ అని పేర్కొంది.
చాలామంది అభిమానులు ప్రీతి జింటా వ్యాఖ్యలతో ఏకీభవించారు. పలువురు యూజర్లు స్పందిస్తూ ‘ఖచ్చితంగా నిజం. విరాట్ కాలంలో టెస్ట్ క్రికెట్ చూడడం అనేది ఒక భిన్నమైన అనుభవం. అభిరుచి, గర్వంతో నిండి ఉంది’ అని ఒకరు పేర్కొనగా.. టెస్ట్ క్రికెట్ మళ్లీ ఎప్పటికీ ఒకేలా ఉండదు అంటూ మరొకరు స్పందించారు. ఇదిలా ఉండగా.. ప్రీతి జింటా సినిమాల విషయానికి వస్తే.. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నది. రాజ్ కుమార్ సంతోషి చిత్రం ‘లాహోర్ 1947’ మూవీలో సన్నీ డియోల్, షబానా అజ్మీ, అలీ ఫజల్‌తో కలిసి నటించనున్నది. ఈ మూవీని ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు.