Prasidh Krishna : భారత స్టీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) పునరాగమనంలో సత్తా చాటాడు. ఐర్లాండ్ పర్యటన (Ireland Tour)లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచి తనలో చేవ తగ్గలేదని నిరూపించాడు. ఈ స్టార్ బౌలర్‌పై మరో పేసర్ ప్రసిధ్ కృష్ణ (Prasidh Krishna) ప్రశంసలు కురిపించాడు. బుమ్రా నుంచి ఎంతో నేర్చుకున్నానని, ఒత్తిడిలో ప్రశాంతంగా బౌలింగ్ చేయడంలో అతడు ఎంతో బెటర్ అని తెలిపాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో(National Cricket Academy) బుమ్రాతో కలిసి ఉన్న ప్రసిధ్ ఇంకా ఏం చెప్పాడంటే..
‘ఎన్సీఏలో బుమ్రాతో కలిసి ఫిట్నెస్ సాధించడం, నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం చాలా గొప్ప ఫీలింగ్ ఇచ్చింది. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా బౌలింగ్ చేయడమే కాకుండా ఏ విషయాన్నైనా సూటిగా చెప్పడంలో బుమ్రా సిద్ధహస్తుడు. ఎన్నోసార్లు అతడు మమ్మల్ని ఇన్స్పైర్ చేశాడు. మా ఇద్దరి మధ్య పరస్పర అవగాహన ఉంది. మేమిద్దరం ఐర్లాండ్ సిరీస్‌లో అద్భుతంగా రాణించాం. ఎన్సీఏలో మేము మానసిక, శారీరక ఆరోగ్యం, ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాం. బౌలింగ్ చేయడం కంటే ముందే అన్ని విధాలా సన్నద్ధమయ్యాం. అందుకనే ఇంత త్వరగా కోలుకున్నాం’ అని ప్రసిధ్ ఎన్సీఏలో గడిచిన రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.
జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ
ఐపీఎల్ 16వ సీజన్‌కు ముందు ప్రసిధ్ గాయపడ్డాడు. దాంతో, సీజన్ అతను మొత్తానికి దూరమయ్యాడు. నిరుడు సెప్టెంబర్‌లో జట్టుకు దూరమైన బుమ్రాతో కలిసి అతను ఎన్సీఏలో కోలుకున్నాడు. వీళ్లిద్దరూ ఐర్లాండ్ సిరీస్‌తో మళ్లీ జట్టులోకి వచ్చారు. అద్భుతంగా రాణించిన బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ప్రసిధ్ నాలుగు వికెట్లతో పర్వాలేదనిపించాడు. దాంతో, వీళ్లిద్దరూ ఆసియా కప్(Asia Cup 2023) స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు. సొంత గడ్డపై జరిగే వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో బుమ్రా, ప్రసిధ్ కీలకం కానున్నారు. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో మెగా టోర్నీ ఆరంభం కానుంది.