Prasidh Krishna : ఓవల్ టెస్టులో భారత జట్టు పైచేయి సాధించడంలో ప్రసిధ్ కృష్ణ (Prasidh Krishna) కీలక పాత్ర పోషించాడు. రెండో రోజు ఆతిథ్య జట్టు నలుగురు ప్రధాన బ్యాటర్లను ఔట్ చేసిన ప్రసిధ్.. జో రూట్ (Joe Root)తో వివాదంలో తన తప్పేమీ లేదని అంటున్నాడు. సూపర్ స్పెల్‌తో ఇంగ్లండ్ నడ్డి విరిచిన ప్రసిధ్ ఆట మధ్యలో రూట్‌కు కాంప్లిమెంట్ మాత్రమే ఇచ్చానని.. అయినా అతడు ఆవేశంతో ఊగిపోయాడని చెప్పాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయం గురించి ప్రసిధ్ మాట్లాడుతూ.. రూట్ అంతగా చిర్రుబుర్రులాడుతాడని తాను ఊహించలేదని అన్నాడు.
అసలేం జరిగిందంటే.. భారత్‌ను స్వల్ప 224 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 129/2తో పటిష్ట స్థితిలో ఉంది. ఆ దశలో ప్రసిధ్ డేంజరస్ జాక్ క్రాలేను బోల్తా కొట్టించాడు. అదే ఓవర్లో రూట్‌ను ఇబ్బంది పెట్టాడీ పొడగరి పేసర్. అక్కడితో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ తర్వాతి బంతిని గల్లీలో బౌండరీ బాదాడు రూట్.. ప్రసిధ్ వంక చూస్తూ ఏదో అన్నాడు. ఓవర్ పూర్తయ్యాక .. నాన్ స్ట్రయికర్ వైప్ వస్తూ కూడా రూట్ కోపంగా మాట్లాడుతూనే ఉన్నాడు. అంతలోనే అంపర్ కుమార ధర్మసేన కలగజేసుకోగా.. భారత పేసర్ తాను ఏమీ అనలేదని వివరణ ఇచ్చాడు.
That Prasidh-Root exchange: ‘Just banter’ says Prasidh; ‘Nothing’ says Trescothick 🗣️ #ENGvIND pic.twitter.com/x9AYL60vCC
— ESPNcricinfo (@ESPNcricinfo) August 1, 2025
‘రూట్ అంతలా రియాక్ట్ అవుతాడని నేను ఊహించలేదు. నువ్వు చాలా మంచి ఆకారంలో ఉన్నావు? అని మాత్రమే అన్నాను. క్రీజులో పాతుకుపోయే రూట్ మైండ్ సెట్ మార్చాలనేది మా గేమ్ ప్లాన్. అందులో భాగంగానే నేను అలా అతడిని కవ్వించాను. కానీ, రూట్ మాత్రం ఓ రేంజ్లో చిర్రుబుర్రులాడాడు. ఎవరెంతగా కవ్వించినా.. నవ్వుతూ బదులిచ్చే అతడు అంతలా ఊగిపోవడం మొదటిసారి చూశాను. అతడు వరల్డ్ క్లాస్ బ్యాటర్. అతడికి బౌలింగ్ చేయడాన్ని నేను ఎంజాయ్ చేశాను. అతడితో వాగ్వాదం కూడా ఆటలో భాగమే’ అని ప్రసిధ్ తెలిపాడు. ఓవల్ మైదానంలో నిప్పులు చెరిగిన ఈ పొడగరి పేసర్ నాలుగు వికెట్లతో రాణించాడు. సిరాజ్ కూడా విజృంభించగా ఆతిథ్య జట్టు 247కే కుప్పకూలింది.