Freestyle Grand Slam : భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద (R Praggnanandhaa) విశ్వ వేదికపై మరోసారి సంచలన ఆటతో అదరగొట్టాడు. వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen)కు ముచ్చెమటలు పట్టించాడు. లాస్ వెగాస్‌లో జరుగుతున్న ఫ్రీస్టయిల్ గ్రాండ్ స్లామ్ (Freestyle Grand Slam) టూర్లో మాగ్నస్‌ను సులువగా మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. తెలంగాణ కుర్రాడు అర్జున్ ఎరిగేసి (Arjun Erigaisi) కూడా అద్భుత విజయంతో క్వార్టర్స్ చేరుకున్నాడు.
ఈమధ్యే భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ (D.Gukesh) చేతిలో కార్ల్సన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి తేరుకొనేలోపే ఈసారి ప్రజ్ఞానంద అతడిని చావుదెబ్బ కొట్టాడు. తెల్ల పావులతో ఆడిన ఈ కేరళ కుర్రాడు ఆది నుంచి వ్యూహాత్మక దాడితో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఒకదశలో నార్వ దిగ్గజానికి పట్టు సాధించే అవకాశం వచ్చింది. కానీ, ప్రజ్ఞానంద అతడికి ఏమాత్రం పుంజుకునే అవకాశం ఇవ్వకుండా చెక్ పెట్టాడు. ఇదివరకే వెస్లే సో చేతిలో కంగుతిన్న కార్ల్సన్ మూడో స్థానం కోసం పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
PRAGG BEATS WORLD NO.1 MAGNUS CARLSEN!
– Praggnanandhaa made into the winners bracket at Freestyle Chess Las Vegas! 💪🔥pic.twitter.com/vspJULuF17
— The Khel India (@TheKhelIndia) July 17, 2025
ఫ్రీస్టయిల్ గ్రాండ్ స్లామ్ టూర్లో వివిధ దేశాలకు చెందిన 16 మంది గ్రాండ్‌మాస్టర్లు పోటీ పడుతున్నారు. వీళ్లను రెండు గ్రూపులుగా విభజించి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో .. రెండు గ్రూప్‌ల నుంచి టాప్-4లో నిలిచిని వాళ్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. విజేతగా నిలిచిన వాళ్లకు 750,000 యూఎస్ డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.6.45 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కనుంది.