బెంగళూరు : విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచుల్లో పంజాబ్, విదర్భ తమ ప్రత్యర్థులను చిత్తుచేసి సెమీస్‌కు దూసుకెళ్లాయి. 3వ క్వార్టర్స్‌లో పంజాబ్.. 183 పరుగుల భారీ తేడాతో మధ్యప్రదేశ్‌పై జయభేరి మోగించింది.
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (88), అన్మోల్ప్రీత్ (70) రాణించడంతో 50 ఓవర్లకు 345/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో మధ్యప్రదేశ్ 31.2 ఓవర్లలో 162 రన్స్‌కే ఆలౌట్ అయింది. మరో మ్యాచ్‌లో విదర్భ.. ఢిల్లీని 76 రన్స్‌తో చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ.. 300/9 స్కోరు చేసింది. ఢిల్లీ 224 రన్స్‌కే పరిమితమైంది. గురువారం జరిగే తొలి సెమీస్‌లో కర్ణాటకతో విదర్భ తలపడనుండగా శుక్రవారం జరుగబోయే రెండో సెమీస్‌లో సౌరాష్ట్ర.. పంజాబ్‌తో మ్యాచ్ ఆడనుంది.