Petra Quitova : కెరియర్లో ఎన్నో సవాళ్లు.. అన్నింటినీ అధిగమిస్తూ విజేతగా నిలిచిందామె. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్లకు షాకిస్తూ రెండుసార్లు వింబుల్డన్ ట్రోఫీ(2011, 2014)ని ముద్దాడింది. అంతలోనే పెళ్లి.. గర్భం దాల్చడంతో ఆట నుంచి విరామం తీసుకుంది. పండంటి బిడ్డను ప్రసవించిన ఆమె.. నెలల వ్యవధిలోనే మళ్లీ రాకెట్ పట్టింది. తల్లిగా కోర్టులో అడుగుపెట్టిన ఈ మాజీ వరల్డ్ నంబర్ 2 విజయంతో మురిసిపోయింది. ఆమె పేరు పెట్రీ క్విటోవా (Petra Quitova). చెక్ రిపబ్లిక్కు చెందిన ఈ క్రీడాకారిణి ఇటాలియన్ ఓపెన్(Italian Open)లో అదరగొట్టింది.
గురువారం జరిగిన తొలి రౌండ్లో రొమేనియాకు చెందిన ఇరినా కమేలియా బెగుపై క్విటోవా ఆధిపత్యం చెలాయించింది. వరుస సెట్లలో ధాటిగా ఆడిన ఆమె 7-5, 6-1తో విజయగర్జన చేసింది. ఓవైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు ప్రాణమైన టెన్నిస్‌లోనూ సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా మొదలుపెట్టింది క్విటోవా. రెండో రౌండ్లో ట్యూనీషియాకు చెందిన ఓన్స్ జబెర్(Ons Jabeur)ను ఢీ కొట్టనుంది.
A positive start in the Eternal City 🙌@Petra_Kvitova gets the better of Begu 7-5, 6-1!#IBI25 pic.twitter.com/NayexGSF1L
— wta (@WTA) May 6, 2025
వింబుల్డన్ విజేత అయిన క్విటోవా 2023 జూలైలో తన కోచ్ జిరి వానెక్(Jiri Vanek)ను పెళ్లి చేసుకుంది. 2024 జవనరి 1వ తేదీన ‘మేము మొదటిసారి త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నాం’ అని ప్రకటించిన ఈ బ్యూటీ.. వింబుల్డన్ టోర్నమెంట్ జరుగుతున్న జూలై నెలలో ‘పీటర్’ అనే అబ్బాయికి జన్మనిచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలకే మళ్లీ టెన్నిస్ మీద దృష్టి సారించిన క్విటోవా.. భర్త ప్రోత్సాహంతో ఆటలో మునపటిలా రాటుదేలింది. ఇటాలియన్ ఓపెన్ తొలి రౌండ్ విజయంతో తన ఎంట్రీని ఘనంగా చాటిందీ మాజీ ఛాంపియన్.