Asia cup 2023 : ఈ ఏడాది ఆసియా కప్‌పై మరోసారి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) కొత్త వాదన మొదలు పెట్టింది. తమ దేశంలో నాలుగు మ్యాచ్‌లు సరిపోవని, మరిన్ని మ్యాచ్‌లు నిర్వహించాలని పీసీబీ పట్టుపట్టనుంది. అవును.. రేపు దుబాయ్ వేదికగా జరుగనున్న ఆసియన్ క్రికెట్ కౌన్సిల్(Asian Cricket Council) సమావేశంలో ఈ విషయాన్ని సభ్యుల దృష్టికి తీసుకెళ్లాలని పీసీబీ అధ్యక్షుడు జకా అష్రఫ్(Jaka Ashraf) అనుకుంటున్నాడట. లాహోర్‌తో పాటు ముల్తాన్(Multan) స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించాలనే ఆలోచనతో పీసీబీ ఉన్నట్టు తెలుస్తోంది.
‘ఏసీసీ సమావేశంలో పాకిస్థాన్ ఓ నిర్ణయానికి రానుంది. వర్ష సూచన ఉన్న శ్రీలంకలో అత్యధికంగా 9 మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాబట్టి పాక్ గడ్డపై నాలుగు కంటే ఎక్కువ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతించాలని సభ్యులను కోరుతాం’ అని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. అయితే.. ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించినందున పీసీబీ అభ్యర్థనకు ఆమోదం తెలుపుతారా? లేదా తోసిపుచ్చుతారా? అనే ఆసక్తి అందరిలో మొదలైంది.
పీసీబీ అధ్యక్షుడు జకా అష్రఫ్, కెప్టెన్ బాబార్ ఆజాం
ఈ ఏడాది హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో ఆసియా కప్ నిర్వహణకు సభ్య దేశాలు అంగీకారం తెలిపాయి. దాంతో ఏసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరుగనున్న ఈ టోర్నమెంట్లో పాకిస్థాన్ 4 మ్యాచ్‌లకు అతిథ్యం ఇవ్వనుంది. శ్రీలంక వేదికగా 9 మ్యాచ్‌లు జరుగనున్నాయి. అయితే.. షెడ్యూల్ ప్రకారం ఈసారి ఆసియాకప్ పాకిస్థాన్‌లో జరగాలి. కానీ, భారత జట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ గడ్డపై అడుగు పెట్టదనీ బీసీసీఐ సెక్రటరీ జ షా తేల్చి చెప్పాడు. దాంతో, అప్పటి పీసీబీ అధ్యక్షడు నజం సేథీ(Najam Sethi) హైబ్రిడ్ మోడల్‌ను తెరపైకి తెచ్చాడు. బీసీసీఐతో పాటు మిగిలిన దేశాల క్రికెట్ బోర్డులు ఈ మోడల్‌కు ఓకే చెప్పాడు. అందుకని ఏసీసీ ఈమధ్యే షెడ్యూల్ విడుదల చేసింది. అంతేకాదు వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) వేదికల విషయంలోనూ పీసీబీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కానీ, ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇస్తూ ముందుగా అనుకున్న ప్రకారమే షెడ్యూల్‌ను విడుదల చేసింది.