ముంబై : సౌతాఫ్రికా ప్లేయర్ కార్బిన్ బోష్(Corbin Bosch)కు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నోటీసులు ఇచ్చింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనేందుకు.. షెషావర్ జల్మీ జట్టుకు అతను ఎంపికయ్యాడు. అయితే ఆ జట్టును వదిలేసి అకస్మాత్తుగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడేందుకు వచ్చేశాడు. దీంతో ఆ ప్లేయర్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహంగా ఉంది. కార్బిన్ బోష్ చర్యల పట్ల పీసీబీ సంతృప్తిగా లేదు.
ముంబై ఇండియన్స్ జట్టులో సౌతాఫ్రికా ప్లేయర్ లిజార్డ్ విలియమ్స్ గాయపడ్డాడు. అయితే అతని స్థానంలో కార్బిన్ బోష్‌కు ముంబై జట్టు ఛాన్సు ఇచ్చింది. కానీ ముందే పాకిస్థాన్ టీ20 లీగ్‌లో ఆడేందుకు ప్రిపేరైన కార్బిన్.. ముంబై నుంచి ఆఫర్ రావడంతో.. ఆ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దాదాపు ఒకే షెడ్యూల్లో పీఎస్ఎల్, ఐపీఎల్ ఉండడంతో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వైపు కార్బిన్ మొగ్గుచూపాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ కోసం కాంట్రాక్టు కుదుర్చుకున్న తర్వాత మళ్లీ ఐపీఎల్‌కు వెళ్లేందుకు కార్బిన్ ఆసక్తి చూపడంతో పాక్ క్రికెట్ బోర్డు ఆ ప్లేయర్‌కు నోటీసులు జారీ చేసింది. అతని ఏజెంట్ ద్వారా ఆ క్రికెట్‌కు నోటీసులు ఇచ్చారు. కాంట్రాక్టు నుంచి వైదొలగడానికి గల ప్రొఫెషనల్ కారణాలు ఏంటో చెప్పాలని పాక్ క్రికెట్ బోర్డు తన నోటీసుల్లో ప్రశ్నించింది. నిర్దేశిత సమయంలోగా సమాధానం ఇవ్వాలని తన నోటీసులో పీసీబీ వార్నింగ్ ఇచ్చింది.
ప్రతిసారి ఫిబ్రవరి-మార్చిలో ఉండే పాకిస్థాన్ టీ20 లీగ్‌ను ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వల్ల ఆలస్యం చేయాల్సి వచ్చింది, ఈసారి ఆ టోర్నీని ఏప్రిల్, మే నెలలో నిర్వహిస్తున్నారు. దీని వల్ల ఆ టోర్నీ షెడ్యూల్.. ఐపీఎల్ మ్యాచ్‌లు కొన్ని ఒకే సమయంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్తో ఒప్పందం చేసుకున్నారు. దాంట్లో బాష్ కూడా ఉన్నాడు. కానీ ముంబై ఇండియన్స్ ప్లేయర్ లిజార్డ్ గాయపడడంతో.. బాష్‌కు పిలుపు రావడం సమస్యాత్మకంగా మారింది.