Champions Trophy : ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో టీమిండియా ఆడడంపై అనిశ్చితి నెలకొంది. భద్రత కారణాల రీత్యా భారత జట్టును పాకిస్థాన్‌కు పంపబోమని బీసీసీఐ (BCCI) తెగేసి చెప్పడమే అందుకు కారణం. దాంతో, పాక్ గడ్డపై కాకుండా దుబాయ్‌లో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆడడంపై స్పష్టత కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయానికి వచ్చింది.
టీమిండియాను పంపేందుకు భారత ప్రభుత్వం అంగీకరించలేదు అనడానికి సాక్ష్యంగా రాత పూర్వక ఆధారం చూపాలని బీసీసీఐని పీసీబీ డిమాండ్ చేసింది. ‘చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు టీమిండియాకు అనుమతి నిరాకరిస్తున్నట్టు భారత ప్రభుత్వం రాత పూర్వకంగా ఓ లెటర్ ఇవ్వాలి. ఆ ఉత్తరాన్ని బీసీసీఐ కచ్చితంగా ఐసీసీకి సమర్పించాలి. అంతేకాదు పాకిస్థాన్ పర్యటనకు సంబంధిన ప్రణాళికను 5 -6 నెలల ముందే ఐసీసికి తెలియజేయాలని మేము పదే పదే బీసీసీఐని కోరాం’ అని పాక్ బోర్డు అధికారు ఒకరు తెలిపాడు.

చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత నెలకొన్న పరిస్థితుల్లో జూలై 19న కొలంబోలో ఐసీసీ (ICC) వార్షిక సమావేశం జరుగనుంది. అయితే.. ఈ మీటింగ్‌లో చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడం, టీమిండియా ఆడుతుందా? లేదా? వంటి అంశాలు ఎజెండాలో లేవని సమాచారం.
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాక్ గడ్డపై చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఒకవేళ భారత జట్టు ఈ టోర్నీలో ఆడకుంటే టీ20 వరల్డ్ కప్ 2026నుంచి వైదొలగాలని పీసీబీ భావిస్తోంది. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీని బాయ్‌కాట్ చేయాలని పాక్ బోర్డు అనుకుంటోంది.