Chandrababu | గత ప్రభుత్వం ఐదేళ్లలో సహజ వనరులను దోపిడీ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని చెప్పారు. గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై చంద్రబాబు సోమవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్తులో భూకబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని హెచ్చరించారు. భూములు, ఆస్తులు కబ్జాలకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఇక్కడా తెస్తామన్నారు.
గత ప్రభుత్వం ఖనిజ సంపదను దోచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ నేతలు అడవులను సైతం ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల పేరుతో భూదోపిడీకి పాల్పడ్డారన్నారు. ఇష్టానుసారం భూములను ఆక్రమించారని విమర్శించారు. రీసర్వే పేరుతో భూముల హద్దులు మార్చేశారని.. విశాఖ మాజీ ఎంపీ హయగ్రీవ భూములు కాజేశారని ఆరోపించారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలకు పాల్పడ్డారని అన్నారు. ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ నేతలు దందాలు చేశారని చంద్రబాబు అన్నారు. పంచభూతాలను సైతం మింగేశారని విమర్శించారు. వైసీపీ ఆఫీసుల కోసం ప్యాలెస్‌లు కట్టారని విమర్శించారు.
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక పరాకాష్ట అని చంద్రబాబు నాయుడు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్రలు పన్నారని ఆరోపించారు. రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫలయత్నం చేశారని అన్నారు. వృద్ధాశ్రమాలను కూడా వదిలిపెట్టలేదని తెలిపారు. వృద్ధాశ్రామానికి ఇచ్చిన హయగ్రీవ ల్యాండ్స్‌ను కూడా కొట్టేశారని అన్నారు. దస్పల్లా భూములను కొట్టేసి ఇళ్లు నిర్మించారని అన్నారు. మాజీ ఎంపీ ఎంవీవీ అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఒంగోలులో నకిలీ పత్రాలతో రూ.101 కోట్ల ఆస్తి కాజేసేందుకు యత్నించారని అన్నారు. ఒంగోలు భూకబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామని చెప్పారు.
తిరుపతి, రేణిగుంటలోని మఠం భూములను కొట్టేశారని చంద్రబాబు తెలిపారు. తిరుపతి జిల్లాలో భూ అక్రమాలకు లెక్కే లేదని అన్నారు. 22-ఏ పెట్టి భూ అక్రమాలు చేశారని అన్నారు. చిత్తూరులో 782 ఎకరాలు కాజేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చర్యలు చేపట్టానని తెలిపారు. పుంగనూరులో 982 ఎకరాల పేదవారి అసైన్డ్ భూములకు పట్టాలు చేయించుకున్నారని అన్నారు. హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వైసీపీ నేతలే నిర్ణయించేవారని.. ముందే స్థలం కొని.. అనేక రెట్ల పరిహారం కొట్టేసేవారని తెలిపారు. గ్రామాల్లో ఉండే ఖాళీ భూములను ఆక్రమించారని విమర్శించారు. నివాసయోగ్యం కాని ఆవ భూములను కేటాయించారని చెప్పారు. అక్రమంగా భవనాలు కట్టేశారని.. ప్రశ్నించే వారిపై దాడులు చేశారని తెలిపారు. 13,800 ఎకరాలను వైసీపీ నేతలకు ధారాదత్తం చేశారని.. తక్కువ ధరకు 40 వేల ఎకరాలను అప్పగించారని అన్నారు. అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకున్నారని విమర్శించారు. భూహక్కుపత్రం పేరుతో ప్రచారానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారని.. భూముల రీసర్వే పేరుతో పట్టాలపై జగన్ చిత్రం ముద్రించుకున్నారని మండిపడ్డారు.
ల్యాండ్ టైటిలింగ్ చట్టం మేరకు ప్రైవేటు వ్యక్తులను నియమించవచ్చని చంద్రబాబు తెలిపారు. ఎంతో అహంభావంతో ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం దురుద్దేశాలను ప్రజలు గ్రహించారని అన్నారు. ఒకసారి భూములను చెక్ చేసుకోవాలని ప్రజలను కోరారు. భవిష్యత్తులో భూకబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని హెచ్చరించారు. భూములు, ఆస్తులు కబ్జాలకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఇక్కడా తెస్తామన్నారు. తాము భూమి యజమానులని కబ్జాదారులే నిరూపించుకోవాల్సి ఉంటుందని చెప్పారు.