ICC : వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 11 సాయంత్రం 6:45 నుంచి ‘బుక్‌మైషో’లో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. ఐసీసీ విడుదల చేసిన టికెట్ పోస్టర్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మెగా టోర్నీ టికెట్ల పోస్టర్ మీద తమ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా ఫొటో లేకపోవడంపై పీసీబీ మండిపడుతోంది.
పురుషుల పొట్టి ప్రపంచకప్ టికెట్లను డిసెంబర్ 11న విడుదల చేసింది ఐసీసీ. టికెట్ పోస్టర్‌పై ప్రధాన జట్ల కెప్టెన్ల ఫొటోలను మాత్రమే ముద్రించారు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా), హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్), దసున్ శనక(శ్రీలంక), ఎడెన్ మర్క్రమ్(దక్షిణాఫ్రికా) ఫొటోలు మాత్రమే ఉన్నాయి. దాంతో.. తమది కూడా పెద్ద జట్టేనని, తమ కెప్టెన్ సల్మాన్ అఘా ఫొటో లేకపోవడం అవమానకరమని పాక్ క్రికెట్ బోర్డు అంటోంది. ఇటీవల ఆసియా కప్ ప్రచారంలోనూ తమ కెప్టెన్ ఫొటోను ఉపయోగించలేదని, ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లోనూ తమ జట్టును ఐసీసీ విస్మరించిందని పీసీబీ వాపోతోంది.
PCB raises concerns after ICC omits Pakistan captain from T20 World Cup promotional poster https://t.co/jIBxGnLNXe
— TOI Sports (@toisports) December 13, 2025
‘ఈమధ్యే ముగిసిన ఆసియా కప్‌లోనూ మాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పుడు అధికారిక ప్రసార సాధనాల్లో పాక్ కెప్టెన్ ఫొటో లేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ను ఇదేంటి? అని ప్రశ్నించగా.. టోర్నీ ప్రచార వీడియోలో మా సారథి సల్మాన్ అఘా ఫొటోను పెట్టారు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ టికెట్ పోస్టర్ మీద కూడా మా జట్టు కెప్టెన్ ఫొటో లేదు. ఈ విషయాన్ని ఐసీసీతోనే తేల్చుకుంటాం. మా కెప్టెన్ ఫొటో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న భారత్, శ్రీలంక వేదికగా ప్రపంచకప్ షురూ కానుంది. పాక్ జట్టు మ్యాచ్‌లన్నీ కొలంబోలో జరుగనున్న విషయం తెలిసిందే.