Pat Cummins : ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) మరోసారి తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య బెకీ బోస్టన్ (Becky Boston) త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని మంగళవారం బెకీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘మా కుటుంబం మరింత క్రేజీనెస్ కోసం సిద్ధంగా ఉంది’ అని భర్త, కుమారుడితో ఉన్న ఫొటోను ఆమె షేర్ చేసింది.
‘ఓ శుభవార్తను మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బేబీ నిన్ను చూసేందుకు మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. మా కుటుంబంలో మరింత ఆనందాన్ని నింపబోతున్నాం’ అని బెకీ తన పోస్టుకు క్యాప్షన్ రాసింది. దాంతో, కమిన్స్ దంపతులకు పలువురు క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
గత ఏడాది నుంచి సుదీర్ఘంగా క్రికెట్ ఆడుతున్న కమిన్స్ రెండు నెలల పాటు ఆటకు బ్రేక్ తీసుకున్నాడు. భార్య ప్రసవం తర్వాత అతడు మళ్లీ బంతి అందుకోనున్నాడు. భారత్‌తో స్వదేశంలో జరుగబోయే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border – Gavaskar Trophy 2024-25)తో ఆసీస్ సారథి మళ్లీ జట్టుతో కలువనున్నాడు.
భార్య, కుమారుడితో కమిన్స్
ఇంగ్లండ్‌లో పుట్టిన బెకీ.. బెర్నార్డ్ కాస్లే స్కూల్లో చదవింది. అనంతరం మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్‌లో బీఏ ఆన్సర్ డిగ్రీ పూర్తి చేసింది. కమిన్స్, బెకీలు 2020లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. రెండేండ్ల తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పటికే కమిన్స్ దంపతులకు నాలుగేండ్ల వయసున్న ‘అల్బీ’ అనే కుమారుడు ఉన్నాడు.
తన కెప్టెన్సీలో ఆసీస్‌కు టెస్టు గద, వన్డే వరల్డ్ కప్ అందించిన కమిన్స్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కలను నిజం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ‘‘నేను ఇప్పటివరకూ గెలవని ట్రోఫీ అంటే బోర్డర్ – గవాస్కర్. జట్టులోని చాలామంది కూడా ఈ సిరీస్ నెగ్గలే. స్వదేశంలో సిరీస్ గెలిచేందుకు ఎంతో పట్టుదలగా ఉన్నాం. భారత్ మంచి జట్టు. ఇండియాతో మేము చాలా క్రికెట్ ఆడాం.
టెస్టు గద, వరల్డ్ కప్ ట్రోఫీలతో..
భారత ఆటగాళ్ల గేమ్ మాకు తెలుసు. అయితే.. మేము కూడా గొప్పగా ఆడగలం’ అని కమిన్స్ తెలిపాడు. నవంబర్ 22న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మొదలవ్వనుంది. 1992 తర్వాత తొలిసారిఐదు టెస్టుల మ్యాచ్‌గా జరుగనుంది. టెస్టు క్రికెట్లో ఆసీస్ ఆధిపత్యానికి భారత్ చెక్ పెట్టింది. 2017 తర్వాత బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని కంగారూ జట్టు గెలవలే. వరుసగా నాలుగు పర్యాయాలు భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. దాంతో.. ఎలాగైనా సరే ఈసారి బీజీటీని ఒడిసిపట్టాలని కమిన్స్ బృందం పట్టుదలతో ఉంది.