Pat Cummins : చెపాక్ స్టేడియంలో మెరుపు శతకం బాదిన రిషభ్ పంత్(Rishabh Pant) ఆస్ట్రేలియా జట్టుకు హెచ్చరికలు పంపాడు. కారు యాక్సిండెంట్ అనంతరం తొలి టెస్టులోనే సెంచరీతో అదరగొట్టిన పంత్.. ‘నేను మళ్లీ వస్తున్నా. కాచుకోండి’ అంటూ కంగారూలకు సవాల్ విసిరాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy) కి ముందు డాషింగ్ బ్యాటర్ ఈ తరహాలో రెచ్చిపోవడం టీమిండియాకు శుభపరిణామం అంటున్నారు విశ్లేషకలు. దాంతో, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) సైతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై స్పందించాడు.
ఈసారి పంత్‌ను నిశబ్ధంగా ఉంచుతామని, అతడికి ఏ అవకాశం ఇవ్వమని కమిన్స్ అన్నాడు. ‘మ్యాచ్‌ను మలుపుతిప్పగల ఆటగాళ్లు ప్రతి జట్టులో ఒకరో ఇద్దరు ఉంటారు. మా టీమ్‌లో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్‌లు దూకుడుగా ఆడి మ్యాచ్‌ను లాగేసుకుంటారు. రిషభ్ పంత్ కూడా అలాంటి ప్లేయర్. అతడు ఆడే రివర్స్ స్లాప్ షాట్ చాలా ప్రత్యేకం. అతడు ఈ మధ్యగ గతరెండు సిరీస్‌లలో చాలా ప్రభావం చూపాడు. అయితే.. ఈసారి మేము అతడిని నిశబ్దంగా మారుస్తాం. అతడి దూకుడుకు కళ్లెం వేస్తాం’ అని కమిన్స్ తెలిపాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ ఏ మాటైనా ఊరికే అనడు. నిరుడు వన్డే వరల్డ్ కప్‌లో అహ్మదాబాద్ అభిమానులను నిశబ్దంగా మార్చేస్తానని అన్నాడు. అన్నట్టుగానే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ల వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ కొట్టాడు. ఆ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అలవోకగా ఛేదించింది. ట్రావిస్ హెడ్(137), మార్నస్ లబూషేన్(58 నాటౌట్)లు దంచికొట్టడంతో ఆసీస్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఆస్ట్రేలియా పర్యటన అంటే చాలు పంత్ వీరోచిత ఇన్నింగ్స్‌లు గుర్తుకొస్తాయి. 2020-21లో కంగారూ గడ్డపై పంత్ ఖతర్నాక్ బ్యాటింగ్‌తో భారత్‌ను గెలిపించాడు. గబ్బా టెస్టులో అర్ధ శతకం (89 నాటౌట్)తో టీమిండియాను గెలిపించాడు. ఇక సిడ్నీ టెస్టులోనూ ఛతేశ్వర్ పూజారాతో కలిసి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, భారత జట్టు 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు.. మరోసారి టీమిండియా నవంబర్‌లో ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. నవంబర్ 22న ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. 1992 తర్వాత బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఐదు మ్యాచ్‌లుగా నిర్వహించడం ఇదే మొదటిసారి.