పారాలింపిక్స్‌లో రెండో రోజు భారత్ పతకాల పంట పండించింది. పారిస్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడలలో భారత్ ఒకే రోజు నాలుగు పతకాలతో సత్తా చాటింది. షూటింగ్ విభాగంలో మన పారా షూటర్లు గంటల వ్యవధిలోనే మూడు పతకాలు సాధించగా అథ్లెటిక్స్‌లోనూ భారత్ బోణీ కొట్టింది. టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణంతో మెరిసిన యువ షూటర్ అవని లేఖరా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో తన పతకాన్ని నిలబెట్టుకోగా ఇదే క్రీడాంశంలో మోనా అగర్వాల్ మూడో స్థానంతో కంచు మోత మోగించింది. యువ పారా అథ్లెట్ ప్రీతి పాల్ వంద మీటర్ల పరుగు పందెంలో చిరుతలా దూసుకొచ్చి కాంస్యం దక్కించుకుంది. పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మనీశ్ నర్వాల్ రజతం సాధించడంతో భారత్‌కు ఒకే రోజు 4 పతకాలు దక్కాయి.
Paralympics | పారిస్: పారాలింపిక్స్ తొలి రోజు పలు క్రీడాంశాలలో శుభారంభం చేసిన భారత పారా క్రీడాకారులు రెండో రోజు పతకాల పంట పండించారు. షూటింగ్లో మన షూటర్లు స్వర్ణం, రజతం, కాంస్యం సాధించి మూడు పతకాలతో మెరవగా అథ్లెటిక్స్‌లోనూ భారత్ బోణీ కొట్టింది. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ (ఎస్‌హెచ్1 కేటగిరీ)లో భారత యువ పారా షూటర్ అవని లేఖరా వరుసగా రెండో స్వర్ణంతో మెరిసింది. మూడేండ్ల క్రితం టోక్యో వేదికగా ముగిసిన పారాలింపిక్స్‌లోనూ ఇదే ఈవెంట్లో గోల్డ్ మెడల్ కొట్టిన అవని.. తాజాగా పారిస్‌లోనూ ఆ ప్రదర్శనను పునరావృతం చేసింది.
249.7 పాయింట్లు స్కోరు చేసిన అవని టోక్యో రికార్డు (249.6)ను అధిగమించింది. స్టేజ్ 1లో పదికి పది షాట్లలో ప్రతి షాట్‌ను లక్ష్యానికి గురిపెట్టిన అవని.. స్టేజ్ 2లో 14 షాట్లలో ఒక్క షాట్‌ను మాత్రమే 9.9 పాయింట్లు స్కోరు చేసింది. పారాలింపిక్స్‌లో అవనికి ఇది మూడో పతకం కావడం విశేషం. టోక్యోలో 10మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణం గెలిచిన ఆమె 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్లోనూ కాంస్యం నెగ్గింది.
అవని స్వర్ణం గెలిచిన ఈవెంట్లోనే మరో భారత్‌కు డబుల్ ధమాకా దక్కింది. షూటర్ మోనా అగర్వాల్ కాంస్యంతో మెరవడంతో పోడియంపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 228.7 పాయింట్లతో మోనా కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కొరియా అమ్మాయి లీ యున్రి 246.8 పాయింట్లతో రజతం గెలుచుకుంది.
మహిళల వంద మీటర్ల (టీ35 విభాగం) ఈవెంట్లో భారత పారా అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్యం నెగ్గింది. ప్రఖ్యాత స్టేట్ డి ఫ్రాన్స్ స్టేడియం వేదికగా జరిగిన రేసులో 23 ఏండ్ల ప్రీతి.. రేసును 14.21 సెకన్లలో పూర్తిచేసి పారిస్‌లో భారత అథ్లెటిక్ బృందం తరఫున తొలి పతకాన్ని అందించింది. యూపీలోని ముజఫర్‌నగర్‌లో సామాన్య రైతు కుటుంబానికి చెందిన ప్రీతి.. చిన్ననాటి నుంచే శారీరకంగా అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఇవే క్రీడల్లో ఆమె 200 మీటర్ల ఈవెంట్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్‌కు అమ్మాయిలే మూడు పతకాలు అందించగా నాలుగో పతకాన్ని మనీశ్ నర్వాల్ తీసుకొచ్చాడు. పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ (ఎస్‌హెచ్1 కేటగిరీ) ఈవెంట్లో మనీశ్ రజతంతో మెరిశాడు. ఈ పోటీలలో 234.9 పాయింట్లు స్కోరు చేసిన అతడు రెండో స్థానంలో నిలిచాడు. కొరియాకు చెందిన జొ జియోన్గు 237.4 పాయింట్లతో స్వర్ణం గెలవగా చైనా షూటర్ యంగ్ చావొ 214.3 స్కోరుతో కాంస్యం నెగ్గాడు. స్టేజ్ 2లో చివరిదాకా అగ్రస్థానంలో ఉన్న నర్వాల్.. ఆఖర్లో గురి తప్పడంతో తృటిలో పసిడి పతకాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
3 పారాలింపిక్స్‌లో అవనికి ఇది మూడో పతకం. టోక్యోలో ఆమె స్వర్ణం, కాంస్యం సాధించింది.