PV Sindhu | పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది. రెండో రోజు జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో అలవోకగా గెలిచింది. మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫాతిమా నబాన అబ్దుల్ రజాక్‌ను కేవలం 29 నిమిషాల్లోనే ఓడించింది. ఫాతిమా రజాక్‌పై 21-9, 21-6 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. కాగా, గ్రూప్ స్టేజిలో ఎస్తోనియాకు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ క్రిస్టినా కూబాతో బుధవారం సింధు తలపడనుంది.
కాగా, రోయింగ్‌లోని రిఫెఛేజ్ విభాగంలో భారత అథ్లెట్ బాలరాజ్ పన్వార్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. రిఫెఛేజ్ విభాగంలో మొనాకో అథ్లెట్ క్వింటిన్ ఆంటోగ్నెల్లి ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా.. బాలరాజ్ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.
తొలిరోజూ అదరగొట్టిన భారత్
కోటి ఆశలతో కొంగొత్త లక్ష్యాలతో పారిస్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన భారత అథ్లెట్లు పతక సాధన దిశగా దూసుకెళుతున్నారు. తమపై పెట్టుకున్న ఆశలను వమ్ముచేయకుండా ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ముందుకు సాగుతున్నారు. శనివారం జరిగిన షూటింగ్ మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్టార్ షూటర్ మను భాకర్ సత్తాచాటింది. గత ఒలింపిక్స్‌లో ఘోరంగా నిరాశపరిచిన మను ఈసారి ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా లక్ష్యంపై గురిపెడుతూ పాయింట్లు కొల్లగొట్టింది. క్వాలిఫికేషన్ రౌండ్లో 580 పాయింట్లు దక్కించుకున్న మను భాకర్ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. వైజే కిమ్(కొరియా), తర్హాన్(టర్కీ), జి లీ(చైనా)తో కలిసి భాకర్ ఫైనల్ పోరులో తలపడనుంది. ఆదివారం జరిగే తుదిపోరులో ఈ స్టార్ షూటర్ మెరిస్తే..ఒలింపిక్స్ షూటింగ్లో పతకం గెలిచిన తొలి భారత మహిళగా అరుదైన రికార్డు సొంతం చేసుకుంటుంది.
మరోవైపు పురుషుల విభాగం క్వాలిఫికేషన్ రౌండ్లో సరబ్జ్యోత్సింగ్ 577 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచి తృటిలో ఫైనల్ బెర్తు కోల్పోయాడు. మరోవైపు 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు నిరాశపరిచారు. అర్జున్ బబుతా-రమిత జోడీతో పాటు సందీప్‌సింగ్- ఎలావెనిల్ వాలరివన్ ద్వయం ఫైనల్ బెర్తు దక్కించుకోలేకపోయింది.
ఒలింపిక్స్ హాకీలో ఘన చరిత్రకు చిరునామా అయిన భారత్..పారిస్‌లో అదిరిపోయే ఆరంభం చేసింది. తమ తొలి పోరులో టీమ్ఇండియా 3-2తో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున మన్‌దీప్‌సింగ్(24ని), వివేక్‌సాగర్(34ని), హర్మన్‌ప్రీత్‌సింగ్(59ని) గోల్స్ చేశారు. మరోవైపు సామ్‌లేన్(8ని), సైమన్ చైల్డ్(53ని) కివీస్‌కు గోల్స్ అందించారు. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా దక్కిన పెనాల్టీ స్ట్రోక్‌ను హర్మన్‌ప్రీత్‌సింగ్ గోల్‌గా మలిచి భారత్‌కు విజయాన్నందించాడు.
బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో యువ షట్లర్ లక్ష్యసేన్ 21-8, 22-20తో కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)పై అలవోక విజయం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనలిస్టు అయిన కార్డన్‌పై లక్ష్యసేన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆది నుంచే జోరు కనబరుస్తూ వరుస గేముల్లో కార్డన్‌ను చిత్తుచేశాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌శెట్టి జోడీ 21-17, 21-14తో ఫ్రాన్స్ ద్వయం కార్వీ, లాబర్‌పై అలవోక గెలిచి ముం దంజ వేశారు. మహిళల డబుల్స్‌లో అశ్విని, తనీషా జోడీ పోరాటం ము గిసింది.
పురుషుల టేబుల్‌టెన్నిస్‌లో హర్మీత్దేశాయ్ ఆకట్టుకున్నాడు. సింగిల్స్ పోరులో హర్మీత్ 11-7, 11-9, 11-5, 11-5తో జైద్ అమో యమన్(జోర్డాన్)పై ఘన విజయం సాధించాడు. పురుషుల టెన్నిస్ డబుల్స్‌లో భారత ద్వయం బాలాజీ, రోహన్ బోపన్న పోరు ఆదివారానికి వాయిదా పడింది.