Paralympics 2024 : పారిస్ వేదికగా జరుగుతున్న పారిలింపిక్స్ ఆరంభం రోజే భారత్‌కు నిరాశ ఎదురైంది. బ్యాడ్మింటన్, తైక్వాండోలో భారత స్టార్లు ఓటమి పాలయ్యారు. తైక్వాండోలో పతకం గెలుస్తుందనుకున్న అరుణ తన్వర్(Aruna Tanwar) గాయంతో వెనుదిరిగింది. మహిళల 44-55 కిలోల విభాగంలో పోటీ పడిన ఆమె 16వ రౌండ్లోనే నిష్క్రమించింది. పారా షట్లర్ మన్దీప్ కౌర్(Mandeep Kaur) తొలి రౌండ్లోనే చేతులెత్తేసింది.
ఎన్నో అంచనాలతో పారిస్ వచ్చిన మన్దీప్.. రెండో సీడ్, నైజీరియా ప్లేయర్ మరియమ్ ఎనియోల బొలాజీ చేతిలో ఓడింది. తొలి సెట్‌ను (8-21) భారీ తేడాతో చేజార్చుకున్న మన్దీప్, రెండో సెట్లో అసమానంగా పోరాడింది. కానీ, వరల్డ్ నంబర్ 2 బొలాజీ ధాటికి నిలువలేక చివరకు 8-21, 14-21తో మన్దీప్ పోరాడి ఓడింది.
మన్దీప్ కౌర్
గురువారం జరిగిన తైక్వాండో 16వ రౌండ్లో అరుణ అత్యుత్తమ ఆట కనబరచలేకపోయింది. టర్కీకి చెందిన నురిచన్ ఎకిన్స్కీ చేతిలో ఆమె 0-19తో ఓడింది. ఐదు నిమిషాల పాటు సాగిన రౌండ్లో అరుణ ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. మోచేతి గాయం కారణంగా ఆమె కాస్త వెనకబడింది. ఇదే అదనుగా ఢిఫెన్స్లో అరుణ బలహీనతలను సొమ్ము చేసుకున్న నురిచన్ తొమ్మిదిసార్లు బాడీ కిక్స్‌తో కీలక పాయింట్లు సాధించింది.