e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home Top Slides అయ్యో శాంసన్‌

అయ్యో శాంసన్‌

అయ్యో శాంసన్‌
  • రాజస్థాన్‌పై పంజాబ్‌ గెలుపు
  • మెరిపించిన రాహుల్‌, హూడా
  • రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ వీరోచిత శతకం వృథా

రాజస్థాన్‌ నయా సారథి సంజూ శాంసన్‌ శతకనాదం వృథా అయింది. కళాత్మక విధ్వంసంతో పరుగుల సునామీ సృష్టించినా ఉత్కంఠ పోరులో పంజాబ్‌ కింగ్స్‌నే గెలుపువరించింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, దీపక్‌ హూడా మెరుపు హిట్టింగ్‌తో తొలుత భారీ స్కోరు చేసిన పంజాబ్‌.. బౌలింగ్‌లో తడబడినా చివరికి బోణీ కొట్టింది. రూ.14 కోట్లు పెట్టి తీసుకున్న రిచర్డ్‌సన్‌ 55 పరుగులు, రూ.8 కోట్ల బౌలర్‌ మెరిడిత్‌ 49 రన్స్‌ ఇచ్చి కొంప ముంచే పని చేసినా.. భారత బౌలర్లు షమీ, అర్షదీప్‌ పంజాబ్‌ను గట్టెక్కించారు.

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ బోణీ కొట్టింది. సోమవారం ఇక్కడ రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ 4 పరుగుల తేడాతో గెలిచింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (50 బంతుల్లో 91; 7 ఫోర్లు, 5సిక్స్‌లు), దీపక్‌ హూడా (28 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 పరుగులు చేసింది. క్రిస్‌ గేల్‌ (40) రాణించాడు. రాజస్థాన్‌ తరపున ఎనిమిది మంది బౌలింగ్‌ చేయగా.. సకారియాకు మూడు, మోరిస్‌కు రెండు వికెట్లు దక్కాయి. లక్ష్యఛేదనలో సారథి సంజూ శాంసన్‌ (63 బంతుల్లో 119; 12 ఫోర్లు, 7సిక్స్‌లు) అనన్య సామాన్యమైన బ్యాటింగ్‌ చేసినా రాజస్థాన్‌ ఏడు వికెట్లకు 217 పరుగులు చేసి.. గెలుపు అంచులో నిలిచిపోయింది. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ మూడు, మహమ్మద్‌ షమీ రెండు వికెట్లు పడగొట్టారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు శాంసన్‌కు దక్కింది.

రాహుల్‌, హూడా తుఫాన్‌

పంజాబ్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (14) మూడో ఓవర్లోనే ఐపీఎల్‌ అరంగేట్ర రాయల్స్‌ పేసర్‌ సకారియా బౌలింగ్‌లో ఔటైనా రాహుల్‌, క్రిస్‌ గేల్‌ నిలకడగా ఆడడంతో ఆరు ఓవర్లకు కింగ్స్‌ 46 పరుగులు చేసింది. శ్రేయస్‌ గోపాల్‌ ఓవర్లో రాహుల్‌ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ను స్టోక్స్‌ బౌండరీ వద్ద నేలపాలు చేయగా.. గేల్‌ ఓ ఫోర్‌ అరుసుకున్నాడు. రియాన్‌ పరాగ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి గేల్‌ క్యాచ్‌ ఔటవడంతో పది ఓవర్లు ముగిసే సరికి కింగ్స్‌ 89 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. రాహుల్‌ జోరు కొనసాగించగా.. దీపక్‌ హూడా తుఫాన్‌ మొదలైంది. దూబే వేసిన 13వ ఓవర్లో సిక్సర్‌తో రాహుల్‌ 30 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుంటే.. హుడా రెండు సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగి గోపాల్‌ బౌలింగ్‌లోనూ దీపక్‌ మూడు సిక్సర్లు బాదాడు. రాయల్స్‌ కెప్టెన్‌ శాంసన్‌ ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించినా ఫలితం లేకపోయింది. మొత్తంగా 20 బంతుల్లోనే హూడా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం హూడాను మోరిస్‌ ఔట్‌ చేసినా రాహుల్‌ రెండు సిక్సర్లు బాదాడు. మొత్తంగా పంజాబ్‌ చివరి 8 ఓవర్లలో 111 పరుగులు రాబట్టడం విశేషం.

శాంసన్‌ శతకనాదం చేసినా..

బెన్‌ స్టోక్స్‌ (0) తొలి ఓవర్‌లోనే కింగ్స్‌ పేసర్‌ షమీ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరగడంతో ఆదిలో రాయల్స్‌కు షాక్‌ తగిలింది. కెప్టెన్‌ శాంసన్‌ దూకుడుగా ఆడగా.. వోహ్రా (12) వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బట్లర్‌ (25).. మెరెడిత్‌ బౌలింగ్‌లో నాలుగు ఫోర్లు బాదడం సహా దూకుడుగా ఆడాడు. దీంతో ఆరు ఓవర్లకు రాజస్థాన్‌ 59 పరుగులకు చేరింది. అయితే శాంసన్‌ మళ్లీ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడంతో 11 ఓవర్లకు రాజస్థాన్‌ 109 పరుగులకు చేరింది. ఈ క్రమంలో సంజూ 33 బంతు ల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దూబే నిరాశ పరచగా.. ఆ తర్వాత వచ్చిన రియాన్‌ పరాగ్‌ (25) రెచ్చిపోయాడు. 16వ ఓవర్లో మూడు సిక్సర్లు రావడంతో సమీకరణం 4 ఓవర్లకు 48కి చేరిం ది. ఆ తర్వాత పరాగ్‌ ఔటైనా శాం సన్‌ వీరోచిత పోరాటం చేశాడు. చూడచక్కని షాట్ల తో 18వ ఓవర్లో 19 పరుగులు పిండుకున్నాడు. అయితే మెరిడిత్‌, అర్షదీప్‌ ఆ తర్వాత రెండు ఓవర్లు పొదుపుగా బౌలింగ్‌ చేశారు. చివరి ఓవర్లో రెండు బంతులకు ఐదు పరుగులు కావాల్సిన సమయంలో ఐదో బంతికి పరుగు తీసేందుకు నిరాకరించిన శాంసన్‌.. చివరి బాల్‌కు ఔటై నిరాశగా వెనుదిరిగాడు.

స్కోరు బోర్డు

పంజాబ్‌: రాహుల్‌ (సి) తెవాటియా (సి) సకారియా 91, మయాంక్‌ (సి) శాంసన్‌ (బి) సకారియా 14, గేల్‌ (సి) స్టోక్స్‌ (బి) పరాగ్‌ 40, దీపక్‌ హూడా (సి) పరాగ్‌ (బి) మోరిస్‌ 64, పూరన్‌ (సి) సకారియా (బి) మోరిస్‌ 0, షారూక్‌ ఖాన్‌ (నాటౌట్‌) 6, రిచర్డ్‌సన్‌ (సి) మోరిస్‌ (బి) సకారియా 0. ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 221/6. వికెట్ల పతనం: 1-22, 2-89, 3-194, 4-201, 5-220, 6-221. బౌలింగ్‌: సకారియా 4-0-31-3, ముస్తాఫిజుర్‌ 4-0-45-0, మోరిస్‌ 4-0-41-2, శ్రేయస్‌ గోపాల్‌ 3-0-40-0, స్టోక్స్‌ 1-0-12-0, తెవాటియా 2-0-25-0, రియాన్‌ 1-0-7-1, శివమ్‌ దూబే 1-0-20-0.

రాజస్థాన్‌: స్టోక్స్‌ (సి&బి) షమీ 0, వోహ్రా (సి&బి) అర్షదీప్‌ 12, శాంసన్‌ (సి) హూడా (సి) అర్షదీప్‌ 119, బట్లర్‌ (బి) రిచర్డ్‌సన్‌ 25, శివమ్‌ దూబే (సి) హూడా (బి) అర్షదీప్‌ 23, పరాగ్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 25, తెవాటియా (సి) రాహుల్‌ (బి) మెరిడిత్‌ 2, మోరిస్‌ (నాటౌట్‌) 2. ఎక్స్‌ట్రాలు: 9. మొత్తం: 20 ఓవర్లలో 217/7. వికెట్ల పతనం: 1-0, 2-25, 3-70, 4-123, 5-175, 6-201, 7-217, బౌలింగ్‌: షమీ 4-0-33-2, రిచర్డ్‌సన్‌ 4-0-55-1, అర్షదీప్‌ 4-0-35-3, మెరెడిత్‌ 4-0-49-1, మురుగన్‌ 4-0-43-0.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ నె,ర పా
ఢిల్లీ 1 1 0 +0.779 2
కోల్‌కతా 1 1 0 +0.500 2
పంజాబ్‌ 1 1 0 +0.200 2
బెంగళూరు 1 1 0 +0.050 2
ముంబై 1 0 1 -0.050 0
రాజస్థాన్‌ 1 0 1 -0.200 0
హైదరాబాద్‌ 1 0 1 -0.500 0
చెన్నై 1 0 1 -0.779 0

ఆ-ఆడినవి, గె-గెలుపు, ఓ-ఓటమి, నె.ర-నెట్‌ రన్‌రేట్‌, పా-పాయింట్లు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అయ్యో శాంసన్‌

ట్రెండింగ్‌

Advertisement