గజ్వేల్, మే 3: పంట దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్‌లో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. బంగ్లా వెంకటాపూర్‌కు చెందిన అన్నమైన శివరాములు (40) తనకున్న 18 గుంటల వ్యవసాయ పొలంలో పచ్చిమిర్చి, కూరగాయలు చేయడంతోపాటు అతడి సోదరికి చెందిన 11 గుంటల విస్తీర్ణంలో బీరతోట వేశాడు. కూరగాయల సాగులో అనుకున్న విధంగా దిగుబడి రాకపోవడంతో పంటల కోసం చేసిన అప్పులతోపాటు కుటుంబ అవసరాలు, చిట్టీల కోసం చేసిన అప్పులను తీర్చే మార్గంలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
గతంలోనే రెండు గుంటలు అమ్మి అప్పులు తీర్చగా, ప్రస్తుతం రూ.5 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఈ క్రమంలో పొలానికి వెళ్తున్నానని భార్య భాగ్యకు చెప్పి గురువారం ఇంట్లో నుంచి వెళ్లాడు. రాత్రయినా భర్త ఇంటికి రాకపోవడంతో ఇంటి పక్కనే ఉండే మరిది గణేశ్‌కు విషయం చెప్పింది. అతడు రాత్రి 10.30 గంటలకు పొలం వద్దకు వెళ్లి చూడగా ట్రాక్టర్ సైలెన్సర్‌కు శివరాములు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. శివరాములు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై భువనేశ్వర్రావు తెలిపారు. రైతు శివరాములు కుటుంబ సభ్యులను గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ నర్సింలు పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.