చౌటుప్పల్ రూరల్, మే 3 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద రూ.4.31 కోట్ల విలువైన 5.694 కిలోల బంగారాన్ని హైదరాబాద్ జోనల్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు. డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి 65పై కారులో నలుగురు వ్యక్తులు కోల్‌కతా నుంచి ప్రయాణం చేస్తున్నారు. పంతంగి టోల్‌గేటు వద్ద అధికారులు ఆపే ప్రయత్నం చేయగా.. తప్పించుకుపోయారు.
అధికారులు వెంబడించి చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామం వద్ద అడ్డగించారు. కారును సోదా చేయగా 5.694 కిలోల తూకం చేసే 35 బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. వాటికి సంబంధించి వారు ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో బంగారాన్ని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.