Pakistan | పెర్త్: ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాలతో పాటు జట్టులో విభేదాలతో ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే సిరీస్ విజయం దక్కింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆ జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో గెలుచుకుని 22 ఏండ్ల తర్వాత ఆసీస్ గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సొంతం చేసుకుంది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మరోసారి బ్యాటింగ్‌లో విఫలమై 31.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది.
సీన్ అబాట్ (30) టాప్ స్కోరర్. పాక్ పేసర్లు షహీన్ అఫ్రిది (3/32), నసీమ్ షా (3/54), హరీస్ రౌఫ్ (2/24) క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆసీస్‌ను దెబ్బతీశారు. అనంతరం ఛేదనను పాక్ 26.5 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఓపెనర్లు సయీమ్ అయూబ్ (42), అబ్దుల్లా షఫీక్ (37) తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి పాక్ విజయాన్ని ఖరారు చేశారు. 2002 తర్వాత పాక్‌కు ఆసీస్‌లో ఇదే తొలి వన్డే సిరీస్ విజయం కాగా నూతన సారథి మహ్మద్ రిజ్వాన్ మొదటి సిరీస్‌తోనే చారిత్రాత్మక విజయాన్ని తన జట్టుకు అందించాడు. ఇరుజట్ల మధ్య ఈనెల 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా టీ20 సిరీస్ మొదలుకానుంది.